ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
రాయగడ: జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్షలకు జిల్లా నుంచి 3,523 మంది విద్యార్థులు హాజరయ్యారు. శనివారం జరిగిన ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు జిల్లాలో గల 11 సమితుల్లో 22 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల కోసం జిల్లా నుంచి 4,225 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోగా ఇందులో 3,523 మంది పరీక్షలకు హాజరయ్యారు.
16 నుంచి ధనుర్మాస పూజలు
రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని శ్రీకళ్యాణవేంకటేశ్వర ఆలయంలో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ధనుర్మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజలు ప్రారంభమవుతాయని ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు శనివారం తెలిపారు. 16న మధ్యాహ్నం 12.31 గంటల సమయంలో ధను సంక్రమాణం ప్రవేశం జరుగుతుందన్నారు. దీన్ని అనుసరించి మొదట పాశుర విన్నపం పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ధనుర్మాసంలో భాగంగా ఈ నెల 30 వ తేదీన వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం, శ్రీసత్యనారాయణ స్వామి వారి వ్రతాలు, సాయంత్రం నమ్మాళ్లార్ అధ్యయన ఉత్సవం నిర్వహిస్తామన్నారు. 31వ తేదీన ఉదయం ఏడు గంటలకు నాయగనాయ్ ద్వార పాలక పూజలు, సాయంత్రం ద్వాదశి కారణంగా సహస్ర దీపాకంకృత ఊంజల్ సేవ వంటి విశేష పూజలు ఉంటాయన్నారు. జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం కొనసాగుతోందని చెప్పారు.


