డొంగాశిలి విద్యాలయాన్ని అప్‌గ్రేడ్ చేయాలి
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి డొంగాశిలిలో గల ఉన్నత మాధ్యమిక విద్యాలయాన్ని అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. విద్యాలయం మెయిన్ గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. అదేవైపుగా వెళ్తున్న జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి విద్యార్థులు చేస్తున్న ఆందోళనను చూసి వారి దగ్గరకు వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. 1957లో డొంగాశిలిలో స్థాపించిన ఈ విద్యాలయం అప్పటి నుంచి ఇంతవరకు కేవలం 8వ తరగతి చదువుకునేంత వరకు ఉందని విద్యార్థులు తెలియజేశారు. అనంతరం పై చదువులకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, దీని ఫలితంగా కొందరు ఆయా ప్రాంతాలకు వెళ్లలేక మధ్యలోనే చదువును నిలిపి వేస్తున్నారని వివరించారు. పదో తరగతి వరకు ఈ విద్యాలయాన్ని అప్‌గ్రేడ్ చేయాలని వారంతా కోరారు. దీనిపై ప్రభుత్వ సంబంధిత శాఖ అధికారులతో సంప్రదించి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని జెడ్పీ చైర్మన్ సరస్వతి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


