పాఠశాల ఎదుట ఆందోళన
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదలలో గల సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న ప్రభుత్వ మాధ్యమిక ఉన్నత పాఠశాలలో తమ పిల్లలను చదువుకునే అవకాశాన్ని కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. పాఠశాల హెచ్‌ఎం వ్యవహార శైలి ఏమాత్రం బాగోలేదని, విద్యార్థుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు దీనిపై నిలదీసినా ఎటువంటి ఫలితం లేదని, అందువల్ల జిల్లా యంత్రాంగం దృష్టి సారించి హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. గత నాలుగు నెలల వ్యవధిలో కౌన్సిలింగ్ పేరిట 20 మంది విద్యార్థులను పాఠశాల నుంచి హెచ్‌ఎం బహిష్కరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదేవిషయమై ఇదివరకు అంబొదల పోలీస్ స్టేషన్‌లో హెచ్‌ఎంపై ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపొవడంతో తామంతా ఆందోళనకు దిగామన్నారు. జిల్లా సంక్షేమశాఖ అధికారి అసీమారావ్‌తో కలిసి ఫిర్యాదు చేయడంతోపాటు హెచ్‌ఎం వ్యవహార శైలిపై జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తామంతా లిఖితపూర్వకంగా తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పటికై నా హెచ్‌ఎంపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని వారంతా కోరారు.


