బాలిజాతర చరిత్రాత్మకం
ముగింపు వేడుకల్లో గవర్నర్ హరిబాబు
భువనేశ్వర్:
చారిత్రాత్మక బాలిజాతర మానవాళికి కాలాతీత సందేశాన్ని అందిస్తోందని, సముద్రాలు విభజించడానికి కాదు అనుసంధానించడానికేనన్న లోతైన సందేశాన్ని వర్ధమాన తరాలకు చాటిచెబుతుందని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. కటక్‌లో నిర్వహించిన చారిత్రక బాలి జాతర ముగింపు కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. బాలి జాతర ముగిసిపోయే వేడుక కాదని, ధైర్యం, సృజనాత్మకత కొనసాగింపు సంబరమని పేర్కొన్నారు. నావికా వ్యాపారుల స్ఫూర్తితో యువత ఆవిష్కరణ, సాంకేతికత, కొత్త కోణాల అన్వేషణతో మేలుకోవాలని పిలుపునిచ్చారు. సద్భావనతో కూడిన వర్తక వ్యాపార ప్రయాణం రాజకీయాలకు అతీతంగా నాగరికతలను ఏకం చేసి సామరస్యాన్ని బలపరుస్తుందన్నారు. శ్రేయస్సు, నైతికత రెండింటి వేడుకగా బాలి జాతరను అభివర్ణించారు. కళింగ ప్రాచీన నావికులు, ఆధునిక ఒడిశా సృజనాత్మకతను మమేకం చేసే మహోత్సవంగా పేర్కొన్నారు. కళింగ సముద్ర వర్తక వారసత్వం ధైర్యవంతులైన నావికులు ఒకప్పుడు మహానది ఒడ్డున నుంచి శ్రీలంక, జావా, సుమత్రా, బాలి, కంబోడియా వంటి సుదూర ప్రాంతాలకు వస్తువులను మాత్రమే కాకుండా కళ, భాష, విశ్వాసం, వెలుగులను మోసుకెళ్లారని వివరించారు. సముద్రం హృదయాలను, నాగరికతలను కలిపే వారధి అని వారి ప్రయాణాలు నిరూపించాయని పేర్కొన్నారు. ఉత్సవాన్ని నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం, కటక్ జిల్లా యంత్రాంగం చేసిన కృషిని గవర్నర్ ప్రశంసించారు. బాలి జాతరకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను కోరే చొరవను కూడా ఆయన అభినందించారు. కార్యక్రమంలో పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక విద్యాశాఖ మంత్రి సంపద్ చంద్ర స్వంయి, చౌద్వార్ కటక్ ఎమ్మెల్యే సౌవిక్ బిస్వాల్, బారాబాటి కటక్ ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌస్, కటక్ సదర్ ఎమ్మెల్యే ప్రకాష్ చంద్ర సెఠి, కటక్ జిల్లా కలెక్టర్ దత్తాత్రయ భౌసాహెబ్ షిండే, కటక్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
బాలిజాతర చరిత్రాత్మకం


