కొరాపుట్ పర్వ్ దివిటీ అడ్డగింత
జయపురం: జాతీయ స్థాయి ఆదివాసీ మహోత్సవం కొరాపుట్ పర్వ్ 2025 బహిష్కరిస్తామని అధికారులను హెచ్చరించిన జయపురం సబ్‌డివిజన్ కుంద్ర సమితి ప్రజలు ప్రజా ప్రతినిధులు, కళాకారులు, రాజకీయ పార్టీల శ్రేణులు అన్నంత పని చేశారు. బుధవారం లక్ష్మీపూర్ సమితి కుట్నిపొదర్‌లో వెయ్యి లింగాల ప్రసిద్ధ శివక్షేత్రంలో ప్రారంభమైన ఆదివాసీ మహోత్సవం కొరాపుట్ పర్వ్–2025 శుభ ప్రారంభోత్సవంలో కుంధ్ర కళాకారులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ పాల్గొనలేదు సరికదా ప్రారంభ స్థలంలో వెలిగించిన పర్వ్ మసాల్(దివిటీ)ను బుధవారం రాత్రి ప్రజలు అడ్డుకున్నారు. పర్వ్‌ను బహిష్కరించినా అధికారులు పర్వ్ మసాల్‌ను తీసుకు రావటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజంగా ఏటా పర్వ్ మసాల్‌ను తీసుకు రావటం కుంద్రాలో గల గ్రామ దేవత మందిరం లేక దుర్గా మందిర ప్రాంతంలో కొరాపుట్ పర్వ్ మసాల్ ను ప్రజలు స్వీకరించటం, ఆ ప్రాంతంలోనే మసాల్‌ను ఉంచటం ఆనవాయితీ. అయితే బుధవారం రాత్రి అధికారులు తీసుకు వచ్చిన పర్వ్ మసాల్‌ను అడ్డుకొని దుర్గా మందిరంలో ఉంచేందుకు అంగీకరించలేదు. ఈ సందర్భంగా పర్వ్ బహిష్కరణ కమిటీ వారికి బీడీఓకు మద్య వాగ్వాదం జరిగింది. కొంత సమయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసు అధికారి అశ్విణీ పట్నాయిక్, తహసీల్దార్‌తో కలసి అక్కడకు చేరుకొని ప్రజలను ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ ప్రజలు పట్టు విడువలేదు. మరోమార్గం లేక కొరాపుట్ పర్వ్ మసాల్‌ను బీడీఓ కార్యాలయంలో ఉంచారు. తాము కుంధ్ర సమితిలో పర్వ్ శుభారంభ ఉత్సవాలు జరపాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని, అందుకే సమితిలో కొరాపుట్ పర్వ్ ఉత్సవాలను తాము బహిష్కరిస్తున్నట్లు కమితీ నేతలు వెల్లడించారు.
కొరాపుట్ పర్వ్ దివిటీ అడ్డగింత


