అనుమతి ఒక చోట.. తవ్వకాలు వేరే చోట
కొండలను తొలిచేస్తున్నా పట్టించుకోని వైనం
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న
అధికారులు
అంతరిస్తున్న విలువైన వృక్ష సంపద
రాయగడ: అవసరమైన మట్టి తవ్వకాల కోసం ప్రభుత్వం ఒక చోట అనుమతిస్తే వేరే చోట తవ్వకాలు ప్రారంభించిన వైనం వెలుగు చూసింది. జిల్లాలోని బిసంకటక్‌లోని ఉర్లాజోడి ప్రాంతంలో కాంట్రాక్టరుకు మట్టిని తవ్వుకొనేందుకు మైనింగ్ విభాగం అనుమతి ఇచ్చింది. అయితే సరాసరి బిసంకటక్‌లోని ఇందిరాకాలనీ సమీపంలోని కొండను తవ్వి మట్టిని తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో బిసంకటక్ ప్రాంతంలోని కొండపై ఉన్న విలువైన వృక్షాల సహితం నాశనం చేసి మట్టిని తరలిస్తున్నారు. దీంతో పర్యావరణం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిసంకటక్‌లో కొత్తగా నిర్మాణం జరుగుతున్న బస్టాండుకు సంబంధించి అవసరమయ్యే మట్టిని ఇందిరాకాలనీ వద్ద గల కొండను తవ్వి టిప్పర్లు, లారీలతొ మట్టిని తరలిస్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో వాహనాలతో మట్టిని రవాణా చేస్తుండటంతో కొండ అంతరించిపోతుంది. కాగా కొండపై ఉన్న విలువైన వృక్షాలు నేలకొరుగుతున్నాయి. ఉర్లాజోడి వద్ద గల కొండను తవ్వుకునేందుకు సంబంధిత కాంట్రాక్టర్‌కు ప్రభుత్వ 1700 క్యూబిక్ సెంటీమీటర్ల మేర మట్టిని తరలించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే అనుమతిని ఇచ్చే ప్రాంతంలో కాకుండా బిసంకటక్ సమీపంలోని ఇందిరా కాలనీ వద్ద గల కొండను తవ్వుకుని వెళ్తుండడంతో బిసంకటక్ వాసులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తహసీల్దార్ వెంకటేశ్వర్‌రెడ్డి వద్ద ప్రస్తావించగా.. మట్టిని తవ్వుకునేందుకు ఉర్లాజోడి వద్ద కాంట్రాక్టు సంస్థకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. అయితే వారు ఎటువంటి అనుమతి లేకుండా వేరే ప్రాంతంలో తవ్వకాలు కొనసాగించడంపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.


