చిక్కుముడి వీడేదెలా..?
కొరాపుట్: మూడు రాష్ట్రాల నేపథ్యం ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కిల్లంశెట్టి వినోద్ (40) మృతి కేసు ఇప్పుడు విశాఖ పట్నం పోలీసుల చేతికి వెళ్లింది. శుక్రవారం విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హస్పిటల్‌లో వినోద్‌కి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహం శనివారం ఉదయం కొరాపుట్ జిల్లా బొరిగుమ్మలోని ఇంటికి తీసుకురానున్నారు. గురువారం విశాఖపట్నంలోని కై లాసగిరి ప్రాంతంలో వినోద్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఆలస్యంగా పోస్టుమార్టం కూడా జరిగింది.
అసలేం జరిగింది..?
వినోద్ మృతిపై సర్వత్రా అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంటి ముందు కారు పార్కింగ్ చేస్తామని వెళ్లిన వ్యక్తి పక్క రాష్ట్రంలో సముద్రంలో శవమై తేలడం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతుడితో పాటు భార్య కూడా ఉద్యోగినే కావడం, అంతేకాక అతని కుటుంబానికి బొరిగుమ్మ లో కోట్లాది రూపాయల ఆస్తి ఉండడం గమనార్హం. తొలుత డబ్బు కోసం కిడ్నాప్‌గా భావించారు. కానీ వినోద్ మృతితో ఇంకా అనుమానాలు పెరిగాయి. ఆత్మహత్య కోసం పక్క రాష్ట్రానికి వెళ్లాడా, అతని వస్తువులు కూడా కారులో ఉండి కేవలం మృతదేహం మాత్రమే సముద్రంలో దొరకడం మరింత అనుమానాలకు తావిస్తోంది.
హైదరాబాద్ కంపెనీ ఆరా
మరో వైపు వినోద్ పని చేస్తున్న హైదరాబాద్‌లోని పహల్ ఫైనాన్ష్ లిమిటెడ్ కంపెనీ వినోద్ మృతిపై ఆరా తీసింది. ఈ కంపెనీ లో వినోద్ డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అనారోగ్య కారణాలతో వారం రోజుల సెలవుపై వెళ్లిన తమ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో వారు శుక్రవారం సంతాపం తెలిపారు.
చిక్కుముడి వీడేదెలా..?
చిక్కుముడి వీడేదెలా..?


