హెచ్‌పీసీఎల్ ఎదుట కార్మికుల ఆందోళన
చనిపోయిన తోటమాలి కుటుంబాన్ని
ఆదుకోవాలని డిమాండ్
రాయగడ: స్థానిక పితామహాల్ వద్ద గల హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) బాటిలింగ్ కంపెనీ ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. కంపెనీలో తోటమాలిగా విధులు నిర్వహించే అలోక్ బిశ్వల్ (25) అనే వ్యక్తి అస్వస్థతకు ఈ నెల 13వ తేదీన మృతి చెందాడు. మృతుని కుటుంబాన్ని కర్మాగారం ఆదుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు శుక్రవారం కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. తోటమాలిగా పితామహాల్ గ్రామానికి చెందిన యువకుడు అలోక్ బిశ్వాల్ ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయితే కంపెనీకి సంబంధించిన ఈఎస్‌ఐ కార్డు అప్‌డేట్ లేకపొవడంతో సరైన వైద్యం అందక ఇబ్బందులు పడ్డాడు. అనంతరం అతనిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతొ వైద్యులు అతనిని బరంపురం తరలించాల్సిందిగా సూచించారు. అయితే కార్మికునిగా విధులు నిర్వహించే అలోక్‌కు ఈఎస్సై కార్డు అప్‌డేట్‌గా లేకపోవడంతో వైద్యం పొందలేక గురువారం మృతి చెందినట్లు తోటి కార్మికులు ఆరోపించారు. ఈఎస్‌ఐ కార్డులు సకాలంలో అప్‌డేట్ కాకపొవడంతో పాటు కంపెనీ యాజమాన్యం విధులు నిర్వహణలో భాగంగా ఎక్కువ సమయాన్ని పనిచేయించుకుంటుందని కార్మికులు ఈ సందర్భంగా ఆరోపించారు. కర్మాగారం యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైపోయిందని.. అందుకు బాధ్యత వహిస్తూ కర్మాగారం నష్టపరిహారం చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా పితామహాల్ గ్రామస్తులు, పంచాయతీ సర్పంచ్ టిటు తాడింగిలు ఆందోళనలో పాల్గొన్నారు. ఇదిలాఉండగా కంపెనీలో తోటమాలిగా విధులు నిర్వహిస్తున్న అలోక్ బిశ్వాల్ రాయిపూర్‌కు చెందిన ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థ తరఫున ఇక్కడ పనుల్లో చేరాడని యాజమాన్యం చెబుతుంది. కంపెనీ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శెశిఖాల్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
హెచ్‌పీసీఎల్ ఎదుట కార్మికుల ఆందోళన


