27న రాష్ట్రపతి పర్యటన
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 27వ తేదీన పలు అధికారిక కార్యక్రమాల కోసం రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన పురస్కరించుకుని ప్రభుత్వం చురుకుగా సన్నాహాలు చేస్తోంది. శాసనసభలో స్పీకర్ సురమా పాఢి అధ్యక్షతన మరియు ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా అధ్యక్షతన స్థానిక లోక్‌సేవా భవన్‌లో వేర్వేరుగా రెండు ప్రత్యేక సమావేశాలు జరిగాయి. రాష్ట్రపతి రాకపోకలకు సంబంధించిన లాజిస్టిక్స్ మరియు భద్రతా చర్యలకు సంబంధించి రాష్ట్ర హోం శాఖ ప్రయాణ ప్రణాళిక మరియు జిల్లా స్థాయిలో సన్నద్ధత వివరాలు తెలియజేసింది. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి భద్రతా సమన్వయం, రాజ్ భవన్‌లో వైద్య సాయం, నిరంతర విద్యుత్ మరియు నీటి సరఫరా, మీడియా మరియు పాస్ వ్యవస్థలు, అశ్విక దళానికి ట్రాఫిక్ నిర్వహణతో సహా సమగ్ర ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. అభివృద్ధి కమిషనర్, అదనపు ప్రధాన కార్యదర్శి అనూగర్గ్, హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సత్యబ్రత సాహు, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా, అగ్నిమాపక సేవల డీజీ సుధాంశు షడంగి, వివిధ విభాగాల ప్రధాన కార్యదర్శులు, గవర్నర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి, భువనేశ్వర్, కటక్ జంట నగరాల పోలీస్ కమిషనర్ మరియు ఖుర్ధా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అన్ని విభాగాలు మరియు పోలీసు అధికారులు పరిపూర్ణ సమన్వయం మరియు బాధ్యతల అమలును నిర్ధారించాలని ప్రధాన కార్యదర్శి అహుజా ఆదేశించారు.
పర్యటన షెడ్యూల్
ఈనెల 27న ఉదయం 11.50 గంటలకు న్యూఢిల్లీ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రాజ్ భవన్‌కు వెళ్తారు. రాజ్ భవన్ ప్రాంగణంలో సాయంత్రం 4 గంటలకు కొత్తగా నిర్మించిన కళింగ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం సాయంత్రం 4.20 గంటలకు ఆమె ఒడిశా శాసనసభను సందర్శించి సాయంత్రం 4.30 నుండి 5.30 వరకు అసెంబ్లీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం రాజ్ భవన్‌లో గవర్నర్ ఇచ్చే విందుకు హాజరవుతారు. నవంబర్ 28న రాష్ట్రపతి ఉదయం 9.35 గంటలకు భువనేశ్వర్ నుంచి లక్నోకు బయల్దేరుతారు.


