బ్రహ్మ మురారి సురార్చిత లింగం..!
● ‘బ్రహ్మసూత్ర శివలింగాలు’ కొలువైన క్షేత్రంగా శ్రీముఖలింగం
● అరుదైన దేవాలయంగా గుర్తింపు
జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీముఖలింగం మరో ప్రత్యేకతనూ కలిగి ఉంది. ఎంతో అరుదైన ‘బ్రహ్మసూత్రాల శివలింగాలు’ కలిగిన క్షేత్రంగా ప్రాశస్త్యం పొందింది. భీమేశ్వరుడు, సోమేశ్వరుడు, వరుణేశ్వరుడు, ఈశాన్య ఈశ్వరుడు, ఎండల మల్లికార్జునులను బ్రహ్మసూత్రాల శివలింగాలుగా పిలుస్తారు. ఇవి కొలువైన క్షేత్రాలు దేశంలో వేలిపై లెక్కపెట్టవచ్చు. అంతటి ప్రాముఖ్యత కలిగిన శివాలయం మన జిల్లాలో ఉండటం సిక్కోలు ప్రజల అదృష్టంగా చెప్పవచ్చు. బ్రహ్మసూత్రాల శివలింగాలను దర్శించుకుంటే సాక్షాత్తు ఆ పరమేశ్వురుడిని దర్శనం చేసుకోవడంగా, పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో శ్రీముఖలింగం క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ జరిగే కార్తీక మాస ఉత్సవాలలో పాల్గొనేందుకు భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తుంటారు. కృతయగంలో గోవిందేశ్వరుడు అనే నామంతో కనాకాకృతిలో, త్రేతాయగంలో మధుకేశ్వరుడనే నామంతో రజతాకృతిలో, ద్వాపరయుగంలో జయంతేశ్వరుడనే నామంతో కాంస్యాకృతిలో, కలియగంలో ముఖలింగేశ్వరుడనే పేరుతో ముఖం దాల్చి శిలాకృతిలో శివుడు శ్రీముఖలింగం క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు.
బ్రహ్మ మురారి సురార్చిత లింగం..!


