ప్రాణహాని లేకుండా చూడడమే లక్ష్యం
● సీఎం మోహన్‌చరణ్ మాఝి
భువనేశ్వర్: మోంథా తుఫాన్ విపత్కర పరిస్థితుల్లో ఎటువంటి ప్రాణహాని లేకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి అన్నారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో వివిధ జిల్లాలు ముఖ్యంగా దక్షిణ ఒడిశా జిల్లాల్లో భారీ వర్షం, ఈదురు గాలులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ వైపరీత్యంలో ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఒక్కరినీ తుఫాన్, వరద ఆశ్రయ కేంద్రాలకు లేదా ఇతర సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు. గతేడాది దానా తుఫాను సమయంలో విజయవంతంగా ప్రజలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించిన విషయాన్ని గుర్తు చేశారు. తుఫాన్ తదనంతర కార్యాచరణలో పునరుద్ధరణ అత్యంత కీలకమన్నారు. ఇంజినీరింగ్ విభాగాలు పూర్తిగా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. తుఫాను తీవ్రతతో కూలిన చెట్లతో రాకపోకలకు ఆటంకం కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ తర్వాత నష్టాన్ని వెంటనే అంచనా వేసి రైతులకు అవసరమైన సాయం అందజేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు.
8 జిల్లాలపై తుఫాన్ ప్రభావం
గంజాం, గజపతి, రాయగడ, కొరాపుట్, మల్కన్‌గిరి, కంధమల్, కలహండి మరియు నవరంగ్‌పూర్‌తో సహా 8 జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. సురక్షిత ప్రాంతాల్లో ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు 2,048 తుఫాన్, వరద ఆశ్రయాలను సిద్ధం చేశారు. ఈ కేంద్రాలకు 8 జిల్లాల నుంచి ఇప్పటివరకు 11,396 మందిని తరలించారు. అవసరమైతే మరో 30,554 మందిని తరలిస్తారు. 1,871 మంది గర్భిణులను ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. మరో 822 మందిని తరలిస్తారు. మొత్తం 2,693 మంది గర్భిణులను ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తారు. తుఫాన్‌ను ఎదుర్కోవడానికి 30 యూనిట్ల ఓడ్రాఫ్, 5 యూనిట్ల ఎన్డీఆర్‌ఎఫ్ మరియు 123 అగ్నిమాపక దళం బృందాలను మోహరించారు. మరిన్ని బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. అవసరమైతే వారిని మోహరిస్తారు. ప్రభావిత 8 జిల్లాల్లోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను ఈనెల 30 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
అధికారులు సిద్ధంగా ఉండాలి
ఇంజినీరింగ్ విభాగాలు నిరంతర విద్యుత్ సరఫరా మరియు తాగునీటి సరఫరా కోసం సిద్ధంగా ఉండాలని ప్రత్యేకంగా ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా జనరేటర్ సెట్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పాముకాటు చికిత్స కోసం తగినంత ఇంజెక్షన్లు, మందులు మరియు చికిత్స కిట్లను సిద్ధంగా ఉంచుతారు. ఈనెల 31 వరకు సముద్రం మరియు కొండ ప్రాంతాలను సందర్శించకుండా పర్యాటకులను నిషేధించారు. మత్స్యకారులు సముద్రంలోకి ప్రవేశించవద్దని హెచ్చరించారు.


