భవితకు రక్షణ
యువతకు శిక్షణ..
● స్వయం ఉపాధి కోర్సులతో ఆర్థిక భరోసా
● ఎచ్చెర్ల మహిళా ప్రాంగణం వేదికగా ట్రైనింగ్
● ఆసక్తి చూపుతున్న మహిళలు
ఎచ్చెర్ల :
ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిగ్రీ పట్టాలు చేతిలో ఉన్నా ఉద్యోగాలు అంత తొందరగా రావడం లేదు. ప్రిపరేషన్‌తోనే కాలం గడిచిపోతుంది తప్ప కొలువు చేతికి అందడం లేదు. పదో తరగతి తర్వాత ఆపేస్తే ఇక అంతే సంగతి. ఈ నేపథ్యంలో స్వయం ఉపాధిపై చాలా మంది మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా యువతులు ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారికి శిక్షణలు కీలకం. అందుకే ప్రభుత్వమే యువతుల కోసం అనేక అంశాల్లో శిక్షణ ఇస్తోంది. హోటల్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ తదితర అంశాల్లో కోర్సులు ఆఫర్ చేస్తోంది. ఎచ్చెర్ల మహిళా ప్రాంగణం వేదికంగా మహిళల కోసం హోటల్ మేనేజ్‌మెంట్, గెస్ట్ సర్వీస్ అసోసియేషన్, టెలీ కాలింగ్, కంప్యూటర్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్, సాఫ్ట్‌స్కిల్స్ కోర్సులు నిర్వహిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన కింద ఉచితంగా శిక్షణ ఇస్తోంది.
భోజన, వసతి సదుపాయాలతో
ఈ ప్రాంగణంలో కోర్సులకు సంబంధించి కనీస విద్యార్హత 10వ తరగతి కలిగిన గ్రామీణ యువతకు శిక్షణ ఇస్తున్నారు. 18 నుంచి 35 ఏళ్ల మహిళలు అర్హులు. 90 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఇప్పటికి 3 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చి 90 మందికి ఉపాధి కల్పించారు. ప్రస్తుతం ఇక్కడ 4, 5 బ్యాచ్‌లకు సంబంధించి 70 మందికి శిక్షణ ఇస్తున్నారు.
మంచి ఉద్యోగావకాశాలు
ఇక్కడ ఉపాధి శిక్షణలో నైపుణ్యతను సాధించిన మహిళలకు విశాఖ హెచ్‌ఆర్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖ భారత్ బ్యాంక్, అమెజాన్, ప్లిఫ్‌కార్ట్, హోటల్ మేనేజ్‌మెంట్, పేరడైజ్, భాష్యవ స్కూల్స్, చిత్తూరులోని అమరాన్ బ్యాటరీస్ వంటి కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. వీరికి నెలకు రూ.20 వేల వేతనంతో కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పూర్తిచేసుకున్న వారి తల్లిదండ్రులకు 2018 నుంచి ఉపాధి పథకం జాబ్‌కార్డు కలిగి ఉండి 100 రోజులు పనిదినాలు పూర్తి చేసుకుంటే వారి అకౌంట్స్‌లో రూ.24 వేలును ఉపాధి హామీ పథకం ద్వారా జమ చేస్తున్నారు.
ఉపాధి లక్ష్యంతో..
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన నేను ఉపాధి లక్ష్యంగా కోర్సులో చేరాను. కోర్సు పూర్తిచేసిన అనంతరం స్వయం ఉపాధి సాధించి ఇంటికి ఆర్థికంగా సహాయ పడతాను. దూరవిద్యలో ఉన్నత విద్యను కొనసాగిస్తాను.
– కె.శ్రావణి, ఎం.లింగాలవలస
ఆర్థిక భరోసా
శిక్షణ ద్వారా ఆర్థికంగా స్థిరపడతాననే నమ్మకం కలుగుతుంది. శిక్షణలో బాగా మెలకువలు నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు ప్రోద్బలంతో శిక్షణలో చేరాను. ఓ వైపు చదువు కొనసాగిస్తూ మరోవైపు శిక్షణ పొందుతున్నాను. – కె.భవానీ, చీపురుపల్లి
నమ్మకం పెరిగింది
కోర్సు వల్ల ఉపాధి లభిస్తుందనే నమ్మకం కుదిరింది. కంప్యూటర్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్పై అనేక విషయాలు నేర్పిస్తున్నారు. భవిష్యత్తులో స్థిరపడగలననే నమ్మకం కుదిరింది.
– టి.పుష్పలత, బైరిపురం
చదువు కొనసాగిస్తూ...
డిగ్రీ చదువును కొనసాగిస్తూ శిక్షణ పొందుతున్నాను. ఇక్కడ శిక్షణ ద్వారా అనేక విషయాలను తెలుసుకుంటున్నాను. ఉద్యోగం సాధించడానికి ఈ శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. – ఎల్.లలిత, ఇప్పిలి
ఆర్థిక ఆసరా..
ప్రస్తుతం నాలుగు, ఐదు బ్యాచ్‌లకు శిక్షణ కొనసాగుతుంది. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ల జారీతో పాటు ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్నాం. కోర్సు విజయవంతంగా ముందుకు సాగుతుంది. తర్వాత బ్యాచ్ వివరాలు త్వరలో ప్రకటిస్తాం.
– కె.గౌరీశ్వరీ, ఇన్‌స్ట్రక్టర్, పొందూరు
భవితకు రక్షణ
భవితకు రక్షణ
భవితకు రక్షణ
భవితకు రక్షణ
భవితకు రక్షణ
భవితకు రక్షణ


