రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పలాస నాయకులకు చోటు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో పలాస నియోజవర్గానికి చెందిన నాయకులకు అవకాశం కల్పిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శిగా డొక్కరి దానయ్య, రాష్ట్ర బూత్ కమిటీ సంయుక్త కార్యదర్శి చింతాడ మాధవరావు, రాష్ట్ర పంచాయతీ విభాగం కార్యదర్శిగా పాలిన శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా ఉంగ సాయికృష్ణ, రాష్ట్ర గ్రీవెన్స్‌సెల్ సంయుక్త కార్యదర్శిగా సొర్ర ఢిల్లీరావు, రాష్ట్ర ఇంటెలెక్చువల్ ఫోరం కార్యదర్శిగా మొదవలస మన్మధరావు, రాష్ట్ర పబ్లిసిటీ విభాగం సంయుక్త కార్యదర్శిగా సురేంద్ర త్యాడిలను నియమించారు.
రాష్ట్రస్థాయి మృదంగ పోటీల విజేతగా గౌతమ్
కంచిలి: జాడుపూడి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి బోరిశెట్టి గౌతం రాష్ట్రస్థాయి మృదంగం పోటీల్లో విజేతగా నిలిచాడు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవాల్లో భాగంగా మృదంగ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. గౌతమ్ గురువు చలపరాయి వినోద్‌కుమార్ శిష్యరికంలో మహతి సాంస్కృతిక కళాసేవా సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన పోటీల్లో కూడా ప్రథమస్థానం దక్కించుకున్నాడు. నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ సంగీతం పట్ల మక్కువ పెంచుకోవడంతో తండ్రి మోహనరావు ప్రోత్సహించారు. గౌతమ్‌ను మాజీ సర్పంచ్ పిలక చిన్నబాబు, వైఎస్సార్ సీపీ నేత పలికల జయరాం, గ్రామస్తులు శనివారం అభినందించారు.


