ఎలుగుబంట్లు హల్‌చల్
● భయం గుప్పిట్లో ప్రజలు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి బి.సింగపూర్ గ్రామ ప్రాంతంలో మరోసారి ఎలుగుబంట్లు స్వైర విహారం చేశాయి. కొద్ది రోజుల కిందట బి.సింగపూర్ రహదారిలో వృద్ధుడిపై ఎలుగుబంట్ల దాడి చేశాయి. ఈ దాడిలో గాయపడిన వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన ప్రజలు మరువ కుండానే మంగళవారం రాత్రి మూడు ఎలుగుబంట్లు బిసింగపూర్‌లో స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిశాయి. గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రాంతంలో కనిపించాయి. సబ్‌స్టేషన్‌లో పనిచేసే ఉద్యోగులు భయంతో పారిపోయారు. గ్రామ ప్రజలు కూడా భయంతో ఇళ్ల నుంచి బయటకు రావటంలేదు. బి.సింగపూర్ ప్రాంతంలో తరచూ ఎలుగుబంట్లు తిరుగుతున్నాయని, గ్రామాల్లోనికి రాకుండా తగిన చర్యలు చేపట్టాలని గతంలో అనేక మార్లు అటవీ విభాగ అధికారులకు తెలియజేసినా తగిన చర్యలు చేపట్టడం లేదన్నారు. తరచూ అవి గ్రామ ప్రాంతాల్లోనికి వస్తున్నాయని, పంటలను పాడు చేస్తున్నాయి. ప్రజలపై దాడి చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. అడవులు తగ్గిపోవటం వలన వణ్యప్రాణులకు ఆహార కొరత కారణంగా అవి గ్రామ ప్రాంతాల బాట పడుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అటవీ అధికారులు గ్రామ ప్రాంతాలకు వచ్చే వన్యజంతువులను పట్టి వాటిని సురక్షిత అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.


