
దాటితే చేటు
లెవెల్ క్రాసింగ్ గేటు..
● ప్రమాదకరంగా గేట్లు దాటుతున్న వైనం ● ప్రమాదాల నివారణకు అధికారుల చర్యలు
భువనేశ్వర్:
రహదారి, రైలు మార్గం కూడలిలో లెవెల్ క్రాసింగ్ గేట్లు ప్రజల ప్రాణాలకు భద్రతగా నిలుస్తున్నాయి. ప్రాణాపాయ పరిస్థితులు నివారించి రైళ్లను సకాలంలో నడిపించే లక్ష్యంతో రైల్వే శాఖ ఈ గేట్లు నిర్వహిస్తోంది. అక్కడక్కడా ఈ గేట్లను ప్రమాదకరంగా దాటుతూ చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి చర్యలు రైల్వే చట్టం ప్రకారం నేరంగా పరిగణిస్తారు. ఈ అవాంఛనీయ సంఘటనల నివారణలో రోడ్డు వినియోగదారులు సహకరించాలని ఖుర్దారోడ్ రైలు మండలం అభ్యర్థిస్తోంది. గేటు మూసివేసేటప్పుడు రోడ్డు వినియోగదారులు బలవంతంగా లెవెల్ క్రాసింగ్ గేట్లను దాటడానికి ప్రయత్నించడం చట్ట వ్యతిరేక చర్య. బలవంతంగా లెవెల్ క్రాసింగ్ గేట్లు దాటే సందర్భాల్లో గేట్ల భద్రతా భాగాలు దెబ్బతింటున్నాయి. రైలు సిగ్నల్ వైఫల్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ బాధ్యతారహిత ప్రవర్తన ఫలితంగా రైళ్లు సమయపాలన కోల్పోవడం, రైలు కార్యకలాపాలకు అంతరాయం, ప్రాణాలకు మరియు ఆస్తికి ప్రమాదం ఏర్పడుతోంది. గత ఏడాది తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్ మండలంలో సమగ్రంగా 113 లెవెల్ క్రాసింగ్ గేటు ఉల్లంఘన సంఘటనలు నమోదయ్యాయి. ఈ నేరం కింద 92 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 8 వరకు ఖుర్దారోడ్ మండలంలో 64 లెవెల్ క్రాసింగ్ గేట్ అక్రమ ఉల్లంఘన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆయా సంఘటనలో ఇప్పటి వరకు 47 మంది నిందితుల్ని అరెస్టు చేశారు.
ఖుర్దారోడ్ మండలంలో ఉల్లంఘనలు
ఖుర్దారోడ్ మండలంలో పలు చోట్ల లెవెల్ క్రాసింగ్ గేట్లు వేసి ఉండగా అతిక్రమించడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది పలు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. భువనేశ్వర్ ప్రాంతంలో ఇటువంటి 11 సంఘటనలు సంభవించగా బరంపురం ప్రాంతంలో 8, పూరీ, భద్రక్, జాజ్‌పూర్ కెంజొహర్ రోడ్ ప్రాంతాల్లో 7 చొప్పున లెవెల్ క్రాసింగు గేటుల నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. కటక్ ప్రాంతంలో 6, పలాస, ఖుర్దా రోడ్ ప్రాంతాలలో 5 వంతున ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
అవగాహన కసరత్తు
లెవెల్ క్రాసింగ్ గేట్ల అక్రమ ఉల్లంఘన నివారణకు ఖుర్దా రోడ్ రైల్వే మండలం భద్రతా విభాగం, రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) సంయుక్తంగా తరచూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ దిశలో సాధారణ ప్రజానీకం స్వచ్ఛందంగా సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
గేటు అతిక్రమణ అపాయం
రైళ్లు, రోడ్డు వాహనాలు సురక్షితంగా, సజావుగా ప్రయాణించడానికి ప్రజల మద్దతు చాలా అవసరం. పట్టాలపై అధిక వేగంతో దూసుకువస్తున్న రైలుని అకస్మాత్తుగా ఆపే అవకాశం ఉండదు. పరుగులు తీస్తున్న రైలుని అత్యవసరంగా నియంత్రించేందుకు బ్రేక్‌లు వేసిన వెంటనే ఆగకుండా కొంత దూరం పోయిన తర్వాత ఆధీనంలోకి వస్తుంది. ఈ స్వల్ప నిడివిలో ప్రాణాపాయ పరిస్థితులు నెలకొంటాయి. మూసి ఉన్న లెవెల్ క్రాసింగ్ గేట్‌ను దాటడానికి చేసే ఏ ప్రయత్నమైనా విపత్తుకు ఆహ్వానం పలికినట్లేనని అధికార వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి నిర్లక్ష్య చర్యలు ఉల్లంఘనకు పాల్పడే వారితో రైలు ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసి రైల్వే ఆస్తికి అపార నష్టం చేకూర్చుతాయి. రైలు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తాయి. ప్రయాణికులు, సరుకు రవాణా రంగాల్లో సమయపాలన విపరీతంగా ప్రభావితమై సుఖమయమైన రైలు ప్రయాణం అసౌకర్యంగా పరిణమిస్తుంది.
నిబంధనలు అతిక్రమించి వేసి ఉన్న గేటు కింద నుంచి వెళ్తున్న ప్రయాణికుడు

దాటితే చేటు

దాటితే చేటు