
పేదలకు దుస్తులు పంపిణీ
రాయగడ: స్థానిక లయన్స్ క్లబ్ అపరాజిత మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం సదరు సమితి కొత్తపేట కమ్యూనిటీ హాల్‌లో పేదలకు దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్తపేట పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన నిరుపేదలకు 80 చీరలు, 70 తువ్వాల్లు, 70 దోవతీలను పంపిణీ చేశారు. అదేవిధంగా కార్యక్రమానికి హాజరైన వారికి ఉచితంగా భోజన సౌకర్యం కల్పించారు. లయన్స్ క్లబ్ అపరాజిత మహిళా విభాగం కొద్ది నెలలుగా ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని.. ఇందులో భాగంగా పేదలకు దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని దీపావళి సందర్భంగా నిర్వహించామని క్లబ్ కార్యదర్శి బరాటం అవంతి తెలియజేశారు. కార్యక్రమంలో క్లబ్ మిడియేట్ పూర్వ జిల్లా గవర్నర్ సరస్వతి పాత్రో, అధ్యక్షులు జి.రామక్రిష్ణ, ఉపాధ్యాక్షురాలు రజిత కోరాడ, ఉపాధ్యక్షురాలు కింతలి శ్రీవాస్తవ, పలువురు సభ్యులు పాల్గొన్నారు.
నాగావళి నదిలో వృద్ధుడు గల్లంతు
రాయగడ: మల్లిగాం సమీపంలోని నాగావళి నదిలో మరో వృద్ధుడు గల్లంతయ్యాడు. సదరు సమితి మల్లిగాం గ్రామానికి చెందిన పెంటయ్య జిలకర్ర (70) అనే వృద్ధుడు శుక్రవారం సాయంత్రం పశువులను పచ్చిక మేపేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో కొన్ని పశువులు నది మధ్యకు వెళ్లడంతో వాటిని గట్టుమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేసేందుకు నదిలోనికి దిగాడు. అయితే నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయాడు. స్థానికులు గమనించి అగ్నిమాపక కేంద్రం సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది శుక్రవారం రాత్రి వరకు గాలించినప్పటికీ ఆచూకీ లేకపోవడంతో శనివారం కూడా గాలించారు. గత పది రోజుల్లో నాగవళి నదిలో పది మంది వరకు మృత్యువాతకు గురయ్యారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఘటనలో గాయాలు పాలైన వారిలో జింజిలిబడి గ్రామానికి చెందిన శంభు, రామచంద్రహుయికలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జింజిలిబడి గ్రామం నుంచి శంభు అనే యువకుడు తన గ్రామం నుంచి వ్యక్తిగత పనిపై జేకేపూర్‌కు బైక్‌పై వెళ్తున్న సమయంలో పెట్రోల్‌బంక్ సమీపంలో ఎదురుగా మరో బైక్‌పై వస్తున్న అదే గ్రామానికి చెందిన రామచంద్రహుయిక అనే వ్యక్తి ఎదురెదురుగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ముందు భాగాలు నుజ్జునుజ్జవ్వగా బైకు చోదకులు తీవ్రగాయాలకు గురయ్యారు. అక్కడగల వారు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన చందిలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థులకు వక్తృత్వ పోటీలు
పర్లాకిమిడి: స్థానిక మహేంద్రగిరి పురపాలక ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి సైన్సు సెమినార్‌లో భాగంగా ‘క్వాంటం యుగం ప్రారంభం’ అనే అంశంపై విద్యార్థులకు వక్తృత్వ పోటీలు శనివారం నిర్వహించారు. దీనివల్ల మనం ఎలాంటి సవాళ్లు ఎదుర్కోగలమో పలువురు విద్యార్థులు వివరించారు. న్యాయ నిర్ణేతలుగా జాతీయ అవార్డు గ్రహీత బినోద్ చంద్ర జెన్నా, సాత్మిక్ పట్నాయిక్‌లు వ్యవహరించగా, ముఖ్య అతిథిగా జిల్లా సైన్సు కో–ఆర్డినేటర్ అంపోలు రవికుమార్, హెచ్‌ఎం పూర్ణచంద్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు దుస్తులు పంపిణీ

పేదలకు దుస్తులు పంపిణీ

పేదలకు దుస్తులు పంపిణీ