
బీజేపీలోకి నువాపడ మాజీ ఎమ్మెల్యే కుమారుడు
భువనేశ్వర్:
నువాపడా శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికకు ముందు మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ఢొలొకియా కుమారుడు జాయ్ ఢొలొకియా శనివారం భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్, మంత్రి సూర్య వంశీ సూరజ్, బీజేపీ సీనియర్ నాయకుడు బసంత పండా, ఎమ్మెల్యే జయ నారాయణ మిశ్రా, ఇతర సీనియర్ బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తల సమక్షంలో ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కాషాయ పార్టీలో చేరారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనం రేపింది. నువాపడా ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో జాయ్ ఢొలొకియా భారతీయ జనతా పార్టీలో చేరడంతో ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో రసవత్తర ఘట్టంగా మలుపు తిరిగింది. ఆయన తండ్రి దివంగత రాజేంద్ర ఢొలొకియా బిజూ జనతా దళ్ విశ్వాసపాత్రుడుగా జీవితాంతం కొనసాగారు. బీజేడీ అభ్యర్థిగా నువాపడా నియోజక వర్గం నుంచి వరుసగా 4 సార్లు విజేతగా నిలిచి దీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించారు. నువాపడా ఉప ఎన్నికలో జాయ్ ఢొలొకియా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం తథ్యమని తేటతెల్లమైంది. జాయ్ ఢొలొకియా చేరిక నువాపడాలో బీజేపీ గెలుపు అవకాశాలను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఛేదించేందుకు మార్గం సుగమమైంది. 2024 శాసన సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు బసంత్ పండా కుమారుడు అభినందన్ పండా బీజేడీ అభ్యర్థి రాజేంద్ర ఢొలొకియా మరియు ఘసిరామ్ మాఝి కంటే వెనుకబడి మూడో స్థానంలో నిలిచారు. జాయ్ ఢొలొకియా బీజేపీలో చేరడం బసంత్ పండా పరపతిని ప్రభావితం చేస్తుంది. నవంబర్ 11న నువాపడా శాసన సభ నియోజక వర్గంలో ఉప ఎన్నిక జరుగనుంది. జాయ్ ఢొలొకియా పార్టీ ఫిరాయింపు నువాపడా ఉప ఎన్నికని ఉత్కంఠ భరితంగా మలిచింది. ఈ పరిణామం వారసత్వ ఓటు బ్యాంకు విభజన ప్రేరేపిస్తుంది. దశాబ్దాల తరబడి ప్రజా సేవలో దివంగత రాజేంద్ర ఢొలొకియా బలమైన వ్యక్తిగత అనుచరులను కూడగట్టుకున్నారు. దీని వల్ల నువాపడాలో బిజూ జనతా దళ్ బలమైన స్థానం సొంతం చేసుకుంది. ఈ వ్యవస్థతో ఆయన కుమారుడు జాయ్ డొలొఖియా గెలుపు తథ్యమనే భావన ఉభయ బీజేపీ, బీజేడీలో తొలి నుంచి స్థిరపడింది. చివరి క్షణంలో బీజేపీలోకి దాటవేత బీజేడీకి మింగుడు పడని పరిస్థితిగా తలెత్తింది.
స్థానిక విశ్వసనీయతసై బీజేపీ ఆశలు
డొలొకియా పరివారం పట్ల నువాపడా నియోజక వర్గంలో స్థిరపడిన విశ్వసనీయత జాయ్ ఢొలొకియా ప్రవేశంతో చేజిక్కించుకున్నట్లు బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. మరో వైపు ఈ నియోజక వర్గం తిరుగులేని బీజేపీ నాయకుడిగా వెలుగొందిన బసంత్ పండా కొంత మేరకు నిరుత్సాహపడినట్లు బీజేపీ శిబిరం సమాచారం. పార్టీ పట్ల విధేయతతో ఆయన చిత్తశుద్ధితో వ్యవహరిస్తే తప్ప బీజేపీ గెలుపు బాట నికరం కాని ప్రతికూల పరిస్థితులు పొంచి ఉన్నాయి. బసంత్ పండా అంకిత భావం బీజేడీ (రాజేంద్ర డొలొకియా) సానుభూతి, వారసత్వ ఓటు బ్యాంకు చీలికని కొంత మేరకు సర్దుబాటు చేస్తుంది. ఢొలొకియా, పండా మధ్య నిష్కల్మష ఐక్యత ఉప ఎన్నికలో బీజేపీ విజయానికి తొలి మెట్టుగా నిలుస్తుంది. వచ్చే నెలలో జరగనున్న నువాపడా నియోజక వర్గం ఉప ఎన్నికలో సమగ్రంగా బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ తీవ్రతరమైంది. గత ఎన్నికల విశ్లేషణ ప్రకారం త్రిముఖ పోటీలో కాంగ్రెసు అభ్యర్థి ఘసిరామ్ మాఝి పరిస్థితి పదిలంగా గోచరిస్తుంది. 2024లో రాజేంద్ర ఢొలొకియా చేతిలో దాదాపు 10,000 ఓట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు చెందిన ఘసిరామ్ మాఝి తన స్థావరాన్ని మరింత బలోపేతం చేసుకోగలిగే అవకాశం లేకపోలేదు. చివరి క్షణం వరకు దివంగత సిటింగ్ ఎమ్మెల్యే కుమారునిపై సానుభూతి ఓట్లు పోలింగ్ పట్ల గట్టి నమ్మకం పెట్టుకున్న బీజేడీ పరిస్థితి డోలాయమానంగా మారింది. జాయ్ డొలొకియా పార్టీ ఫిరాయింపు ఆకస్మిక పరిణామం నేపథ్యంలో విపక్షం హోదాకు దిగజారిన బిజూ జనతా దళ్ సొంత కేడర్, సంస్థాగత యంత్రాంగంపై ఆధారపడి ఉప ఎన్నిక పోరు నుంచి గట్టెక్కాల్సిన పరిస్థితి నెలకొంది.