
ధనధాన్య కృషి పథకం ప్రారంభం
రాయగడ: లోక్‌నాయక్ స్వర్గీయ జయప్రకాష్ నారాయణ్ జయంతిని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధనధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని వర్చువల్ మాధ్యమంలో శనివారం నాడు ప్రారంభించారు. స్థానిక రాణిగుడఫారంలోని బిజుపట్నాయక్ కళ్యాణ మండపంలో ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ముఖ్యఅతిథిగా హాజరై ఢిల్లీ నుంచి ప్రసారమైన వర్చువల్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రైతుల సంక్షేమం కోసం ఈ పథకం ప్రారంభించామని వివరించారు. పథకం ముఖ్యఉద్దేశాన్ని మోదీ వర్చువల్ మాధ్యమంలో రైతునుద్దేశించి ప్రసంగించారు. దేశంలో దాదాపు వంద జిల్లాల్లో రైతులు పప్పుదినుసుల పంటలను పండించి ఆర్థికంగా ముందుకు వెళుతున్నారని మోదీ అన్నారు. ఒడిశా రాష్ట్రంలోని నువాపడ, మల్కన్‌గిరి, కంధమాల్, సుందర్‌ఘడ్ జిల్లాల్లో ఇప్పటికే వ్యవసాయం పట్ల రైతులు ఆవగాహన పొంది ఆర్థిక సారికారితను పొందుతున్నారని అన్నారు. రాయగడ జిల్లాలో కూడా 11 సమితుల్లో 180 మందికి పైగా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇదేతరహా పంటలపై ఆసక్తి కనబరచాలని సూచించారు.