
చోరీ కేసుల్లో నిందితులు అరెస్టు
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వేర్వేరు చోరీ ఘటనలకు సంబంధించి ఇద్దరు నిందితులను గురువారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నిందితుల నుంచి చోరీకి గురైన సామాన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 2వ తేదీన పోలమ పంచాయతీలోని కెందుగుడ గ్రామంలో ప్రశాంత్ కొరకొరియా అనే వ్యక్తికి సంబంధించిన జనసేవా కేంద్రంలో చోరీ జరిగింది. కేంద్రంలోని ల్యాప్‌టాప్, రెండు మానిటర్లు చోరీ చేశారు. దీనికి సంబంధించి బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా సునాఖండి పంచాయతీలోని జయరాం కులసిక అనే వ్యక్తి బైకు చోరీకి గురయ్యింది. ఈ రెండు కేసులకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
భారీగా గుట్కా నిల్వలు స్వాధీనం
మల్కన్‌గిరి: జిల్లాలోని బలిమెల పోలీసులు ముందస్తు సమాచారంతో ఐఐసీ ధీరాజ్ పట్నాయిక్ ఆధ్వర్యంలో శుక్రవారం భారీగా గుట్కా నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం సమయంలో బలిమెల మార్కెట్‌లో ఉన్న టి.మురళీధర్ పాత్రో దుకాణంపై దాడి చేశారు. దీనిలో భాగంగా దుకాణం వెనుక గోదాములో నిల్వ ఉంచిన గుట్కా స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ రూ.లక్షకు పైగా ఉంటుందని అంచనా. మురళీధర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
పడవ బోల్తా
● 8 మంది మత్స్యకారులు సురక్షితం
భువనేశ్వర్: కేంద్రాపడా జిల్లా రాజ్‌నగర్ సతొభయా సమీపం సముద్ర తీరంలో ఒక పడవ బోల్తా పడింది. అందులో 8 మంది మత్స్యకారులు ఉన్నారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ఈదుకుంటూ సురక్షితంగా తీరం చేరి బతికి బట్ట కట్టారు. ప్రమాదం నుంచి బయట పడిన వారంతా భద్రక్ ప్రాంతీయ మత్స్యకారులు. సతొభయా సమీపం సముద్ర తీరంలో ఉండగా సాంకేతిక లోపాన్ని గమనించారు. సమయస్ఫూర్తితో పడవలోని మత్స్యకారులు స్పందించి ప్రాణాలను కాపాడుకున్నారు. సకాలంలో పడవను తీరం వైపు మళ్లించడానికి ప్రయత్నించారు. ఇంతలో పడవలో ఒక భాగం విరిగిపోవడంతో పడవలోకి నీరు వేగంగా చొచ్చుకుపోయింది. పడవ మునగక ముందే సముద్రంలోకి దూకి ఈదుకుంటూ మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో ఘోర ప్రమాదం తప్పింది.