
కుంద్ర సమితి అధ్యక్షుడిగా తరుణ సేన్ బిశాయి
జయపురం: జయపురం సబ్‌డవిజన్ కుంద్ర సమితి అధ్యక్షునిగా ఆ సమితి ఉపాధ్యక్షుడు తరుణ సేన్ బిశాయి గురువారం పూర్తి బాధ్యతలు చేపట్టారు. గత అధ్యక్షురాలు రాజేశ్వరి పోరజపై అవినీతి ఆరోపణలు రావటం ఆమైపె సర్పంచ్‌లు, సమితి సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడంతో తీర్మానంపై ఓటింగ్ జరగకముందే ఆమె రాజీనామా చేసిన విషయం పాఠకులకు విదితమే. ఆమె రాజీనామా తర్వాత ఉపాధ్యక్షుడు తరుణసేన్ బిశాయిని అధికారులు తాత్కాలిక అధ్యక్షునిగా నియమించారు. నేడు అతడికి అధ్యక్షునిగా పూర్తి బాధ్యతలు అప్పజెప్పారు. ఈ సందర్భంగా బిశాయి ప్రసంగిస్తూ నూతన అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగేంత వరకు సమితి సభ్యులు, సర్పంచ్‌లు, అధికారులు, సమితి సిబ్బంది తనకు పూర్తిగా సహకరించాలని కోరారు. తాను సమితి సర్వాంగ వికాసానికి శాయశక్తులా పనిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కుంద్ర బీడీఓ పి.మనశ్మిత మాట్లాడుతూ సమితి నూతన అధ్యక్షుని టీమ్ ప్రజల మన్నలను పొందుతారని తాను ఆకాక్షిస్తున్నానన్నారు. కార్యక్రమంలొ కుంద్ర బ్లాక్ బీజేడీ అధ్యక్షుడు బృందావన మల్లిక్ మాట్లాడుతూ అధ్యక్షుడు తరుణసేన ప్రజల సమస్యలు పరిస్కరించటంలో ముందుంటారని అన్నారు.