
మంత్రివర్గం ఆమోదం
ఉద్యోగులకు వారానికి 10 గంటలు పని
ఓవర్ టైమ్‌కు రెట్టింపు జీతం
భువనేశ్వర్:
ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన లోక్ సేవా భవన్ సమావేశం హాల్‌లో సోమవారం మంత్రివర్గం సమావేశమైంది. మూడు విభాగాలకు సంబంధించి నాలుగు ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రజాపనుల శాఖ, పాఠశాలలు– సామూహిక విద్యాశాఖ నుంచి ఒక్కోటి చొప్పున, కార్మిక–ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకం శాఖ నుంచి 2 చొప్పున మొత్తం నాలుగు ప్రతిపాదనలు ఆమోదం పొందాయి.
కార్మిక చట్టాల సవరణలు, కొత్త విద్యా పథకం, కెంజొహర్ జిల్లా ఘొటొగాంవ్ తరిణి పీఠం సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ఉన్నాయి. ఒడిశా దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టం, 1956 కార్ఖానాల చట్టం, 1948 సవరణలను మంత్రి మండలి ఆమోదించింది. దీనిప్రకారం రోజువారీ పని గంటలను తొమ్మి ది నుంచి 10 గంటలకు పెంచారు. వారం రోజుల గరిష్ట పరిమితి 48 గంటలుగానే కొనసాగుతుందని ప్రకటించారు. తాజా సవరణల ప్రకారం నిర్ధారిత పరిమితికి మించి పనిచేసే ఉద్యోగులకు ఓవర్ టై మ్ వేతనాలు లభిస్తాయని ముఖ్యమంత్రితెలిపారు.
మహిళా ఉద్యోగులు రాత్రి పూట విధుల్లో పాల్గొ నేందుకు వీలు కల్పించే మైలురాయి నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. వారు లిఖితపూర్వక అనుమతిని సమర్పిస్తే, వారి భద్రతను నిర్ధారించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని మంత్రివర్గం అభ యం ఇచ్చింది. ‘ఒడిశాలో కార్మిక సంక్షేమం, విద్యా మౌలిక సదుపాయాలు, మతపరమైన పర్యాటకా న్ని బలోపేతం చేయడంలో ఈ నాలుగు ప్రతిపాదనలు ప్రాధాన్యత సంతరించుకుని దైనందిన జీవ నంలో అనేక మంది ప్రజల శ్రేయస్సును నిర్ధారిస్తా యని ముఖ్యమంత్రి అన్నారు.
కార్మిక చట్టాల సవరణలు..
మంత్రివర్గం తాజా నిర్ణయం మేరకు ఇక నుంచి 20 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులను నియమించే సంస్థలకు ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈ ఎస్‌ఐ) చట్టం– 1948 సవరణలు వర్తిస్తాయి.
గోదాబరీష్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల పథకం ఆమోదం..
విద్యా హక్కు చట్టం, 2009కి అనుగుణంగా విద్యా రంగంలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడా నికి గోదాబరిష్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల పథకా న్ని మంత్రివర్గం ఆమోదించింది. ప్రతి పంచాయతీ లో కనీసం ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం. అంచెలంచెలుగా ఈ నిర్ణయం వాస్తవ కార్యాచరణకు మార్గదర్శకాల్ని మంత్రివర్గం ఖరారు చేసింది. తొలి దశలో రాగల 3 సంవత్సరాల్లో రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో 2,200 ఆదర్శ పాఠశాలలను నిర్మిస్తారు. ప్రతి పాఠశాలకు రూ.5 కోట్లకు పైగా నిధులు మంజూరవుతాయి. తొలి దశ పూర్తి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలకు ఈ పథకం కార్యాచరణ విస్తరిస్తారు.
తరణి మాత ఆలయం అభివృద్ధి..
కెంజొహర్ జిల్లా ఘొటొగాంవ్ తరిణి మాత ఆల యం పార్శ్వ ప్రాకారం సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రి వర్గం రూ.226 కోట్ల ప్రాజెక్టును ఆమోదించింది. 69 ఎకరా విస్తీర్ణంలో అభివృద్ధి పనుల కోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన భక్తులకు మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను పెంచడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా 246 మందికి సౌకర్యాలతో కూడిన యా త్రికుల సత్రము మరియు సామూహిక సమావేశాల కోసం 500 సీట్ల హాల్ నిర్మాణం తదితర ప్రణాళికలను మంత్రి మండలి నిర్ధారించింది.
●దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టం, 1956లో సంస్కరణలు..
●ఈ చట్టం 20, అంతకంటే ఎక్కువ మంది కార్మికులను నియమించే సంస్థలకు వర్తిస్తుంది.
●రోజువారీ పని గంటలు 9 నుంచి 10 గంటలకు పెంపుదల.
●నిర్విరామంగా పని షిఫ్టుల నిడివి 6 గంటలకు పొడిగింపు.
●త్రైమాసిక ఓవర్ టైమ్ పరిమితిని 50 నుంచి 144 గంటలకు విస్తరణ.
●రోజుకు 10 గంటలు, వారానికి 48 గంటలు మించి పనిచేసే ఉద్యోగులకు ఓవర్ టైమ్ కింద రెట్టింపు వేతనాలు మంజూరు.
●సవరించిన చట్టం అధీనంలో సంస్థలు నిత్యం రాత్రింబవళ్లు సంవత్సరంలో 365 రోజులు పనిచేయడానికి అనుమతి.
●దుకాణాలు, వాణిజ్య సంస్థలు ఒడియాలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం అనివార్యం.