
భవితకు నిచ్చెన..!
● వెల్డింగ్‌తో ఉపాధికి విస్తృత అవకాశాలు
● జిల్లాలో 250 వరకు శిక్షణ సంస్థలు
● విదేశాల్లో మంచి జీతాలు
● మోసపోవద్దని పోలీసుల సూచన
వెల్డింగ్
శిక్షణ..
మా శిక్షణ సంస్థలో నైపుణ్యతకు ప్రాధాన్యత ఇస్తాం. విదేశాలకు వెళ్లేందుకు యువతకు సూచనలతో పాటు అక్కడ చట్టాలు, తదితర అంశాలను వివరిస్తాం. స్వయంగా అభ్యర్థులు విశాఖ, ఇచ్ఛాపురం, హైదరాబాద్ ప్రాంతాల్లో ఇంటర్వ్యూలకు హాజరై విదేశాలకు వెళ్లి వస్తున్నారు. నేను పదేళ్లు విదేశాల్లో పనిచేశాను. టిగ్, ఆర్క్, గ్యాస్ కటింగ్‌లో అనుభవం ఉంది. మా ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో శిక్ష సంస్థ ఏర్పాటు చేశాం. రిజిస్ట్రేషన్ ఉన్న శిక్షణ సంస్థల్లో మాత్రమే శిక్షణ తీసుకోవాలి. మోసాలు బారిన పడకుండా చూసుకోవాలి. సబ్ ఏజెంట్లు, మోసగాళ్లను నమ్మి మోసపోకుండా చూసుకోవాలి.
– కర్ని భీమారావు, దుర్గా గణపతి వెల్డింగ్ ఇనిస్టిట్యూట్, పూండి
నేను సింగపూర్, మలేషియా, దుబాయ్, బ్యాంకాక్ తదితర దేశాల్లో ఉద్యోగం చేసి వచ్చాను. సొంతంగా శిక్షణ సంస్థ పెటుకున్నాను. దేశీయంగా వివిధ ప్రాజెక్టులు, కంపెనీల్లో నైపుణ్యత కలిగిన యువత కావాలని చాలా సంస్థలు ఎదురు చూస్తున్నాయి. ప్రధానంగా మూలపేట పోర్టు, స్టీల్‌ప్లాంట్, ఎన్‌ఎండీసీ, తదితర కంపెనీల్లో ఉద్యోగాలు పొందేందుకు యువత ఆసక్తి కనబరుస్తున్నారు. వెల్డింగ్‌లో 3జీ, 4జీ, 6జీ, టిగ్, ఆర్క్ వెల్డింగుల్లో శిక్షణ ఇచ్చి సొంతంగా ఉపాధి అవకాశాలు కలిగేలా సూచనలు చేస్తున్నాం. సాంకేతిక విద్యలో స్కిల్ ఉంటే ఎక్కడైనా మంచి పొజిషన్ లభిస్తుంది.
– జి.వైరెడ్డి, శిక్షణ సంస్థ యజమాని, దేవునల్తాడ
వజ్రపుకొత్తూరు: నేటి యువత అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్ కొలువులే కాకుండా వెల్డింగ్ రంగంపై కూడా ఆసక్తి పెంచుకుంటున్నారు. సాంప్రదాయ వెల్డింగ్‌తో పాటు హైటెక్ ఆటోమేటెడ్ పరికరాలను ఉపయోగించే పరిశ్రమలకు ఉపయోగపడే ప్రొఫెషనల్ వెల్డింగ్‌లోనూ నైపుణ్యం సాధిస్తున్నారు. వెల్డింగ్‌లో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో సొంతంగా వెల్డింగ్ ఇనిస్టిట్యూట్, ఫ్యాబ్రికేషన్లను ప్రారంభించి మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. మరికొంతమంది విదేశాల బాట పడుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులతో సమానంగా నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు సంపాదిస్తున్నారు.
ఉత్తమ ఉపాధి అవకాశాలు
చేతిలో పని(స్కిల్) ఉంటే ఎలాంటి సంస్థలైనా ఉపాధి కల్పిస్తాయని తెలుసుకుని ఇప్పుడు శిక్షణ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ప్రతిభ ఉన్నవారికి ఉపాధి అవకాశాలు తలుపు తడుతున్నాయి. వెల్డింగ్, ఫిట్టర్, సేఫ్టీ రంగాల్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈ రంగాల్లో జీతం నెలకు రూ.3.50 లక్షల వరకు సంపాదించే యువత కూడా ఉద్దానం ప్రాంతంలో ఉన్నారు. రష్యా, ఇటలీ, జపాన్, పోలెండ్ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. దీంతో యువకులు ఈ కోర్సులపై మొగ్గు చూపుతున్నారు. రేపటి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయడానికి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కంచిలి, హరిపురం, పలాస, పూండి, నరసన్నపేట, శ్రీకాకుళం, రూరల్, అర్బన్ ప్రాంతాల్లో దాదాపు 250కి పైగా వెల్డింగ్ ఇనిస్టిట్యూట్లు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నాయి. స్కిల్ ఉన్నవారిని పిలిచి మరీ ఉద్యోగాలు ఇస్తారని తెలుసుకుని యువకులు పోటీతత్వంతో ముందుకు సాగుతున్నారు. వీరికి వెల్డింగ్ రంగం గొడుగు పడుతోంది.
సర్టిఫైడ్ కోర్సులకు డిమాండ్
ఉన్నత విద్యను అభ్యసించినవారు సైతం ఉపాధి కోసం సాంకేతిక విద్యను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా వెల్డింగ్, గ్యాస్ కటింగ్‌లపై శ్రద్ధ చూపిస్తున్నారు. వెల్డింగ్‌లో సెర్టిఫైడ్ కోర్సులను అభ్యసించి ఇండియాలో స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రాజెక్టుల్లో పాటు విదేశాల్లో సైతం ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించడంలో విశాఖ, శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పూండి ప్రాంతాల్లోని వెల్డింగ్ శిక్షణ కేంద్రాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఆరు నెలలు, ఏడాది పాటు శిక్షణ పొందితే చాలు ఏ సంస్థ అయినా వెల్డర్‌గా పనిలోకి తీసుకుంటుంది. ఇది నిరుద్యోగులకు వరంగా నిలుస్తోంది.
విదేశాల్లో ఉద్యోగాలు
ఉద్యోగం సాంపాదించడం కోసం వెల్డింగ్ నేర్చుకుని సింగపూర్, దుబాయ్, అబుదాబి, అమెరికా, ఆస్ట్రేలియా, పోలెండ్, రష్యా, అజర్‌బైజాన్, కత్తర్, థాయ్‌లాండ్, బ్యాంకాక్, మలేషియా వెళ్లిన యువకులు జిల్లాలో అనేక మంది ఉన్నారు. అధికంగా యువకులు విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తుండడంతో వారి అవసరాలకు అనుగుణంగా వెల్డింగ్ శిక్షణ సంస్థలు వివిధ కోర్సులను అందిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 250 వరకు శిక్షణ సంస్థలు 3జీ, 4జీ, 6జీ, టిగ్, ఆర్క్, మిగ్ వెల్డింగ్‌లో శిక్షణ అందిస్తున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు ఇంటర్, ఐటీఐ చేసిన వారిలో ఎక్కువ మంది వెల్డింగ్, ఫిట్టర్, సేఫ్టీ, క్యూసీ రంగంలో ఆసక్తి కనబరుచుకుని ప్రగతికి బాటలు వేసుకుంటున్నారు. ఆటోక్యాడ్ ఇతర సర్టిఫికెట్ కోర్సుల్లో శిక్షణ పొందినవారితో పాటు ఉన్నత విద్యను అభ్యసించినవారు సైతం, టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తుండడంతో వెల్డింగ్‌కు విశేష ఆదరణ లభిస్తోందని శిక్షణ సంస్థల నిర్వహకులు చెబుతున్నారు.
కాగా విదేశీ ఉద్యోగాల మోజులో యువత కొంతమంది ఏజెంట్లు, మధ్యవర్తులను నమ్మి మోసపోతున్నారు. లక్షలాది రూపాయలను వారి చేతిలో పెట్టి టూరిస్టు విసాలతో వెళ్లి అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. గుర్తింపు పొందిన వెల్డింగ్ ఇనిస్టిట్యూట్ అసోసియేషన్లలో నమోదైన సంస్థల్లో మాత్రమే శిక్షణ తీసుకోవాలని పోలీసులు చెబుతున్నా యువత పెడచెవిన పెట్టి ఉద్దానం, తీర ప్రాంత గ్రామాల్లోని విదేశీ ఏజెంట్ల వలలో చిక్కిపోతున్నారు. నకిలీ వీసాలతో పాటు కంపెనీ కాంట్రాక్టు కాపీలు, జీతం, వసతి అలవెన్సులు తదితర విషయాల్లో సైతం మోసాలకు పాల్పడుతుండడంతో విదేశీ ఉద్యోగాల పేరుతో మోసపోయిన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.

భవితకు నిచ్చెన..!

భవితకు నిచ్చెన..!

భవితకు నిచ్చెన..!

భవితకు నిచ్చెన..!