జట్నీ – పిప్పిలి మార్గంలో మహిళ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

జట్నీ – పిప్పిలి మార్గంలో మహిళ దుర్మరణం

Sep 13 2025 2:36 AM | Updated on Sep 13 2025 2:36 AM

జట్నీ

జట్నీ – పిప్పిలి మార్గంలో మహిళ దుర్మరణం

భువనేశ్వర్‌: పూరీ జిల్లా జట్నీ–పిప్పిలి మార్గం డెలాంగ్‌ చౌరస్తా సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలైంది. దంపతులు ప్రయాణిస్తున్న బైక్‌ను ట్రక్కు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భర్త పరిస్థితి విషమంగా కొనసాగుతుంది. మృత మహిళ డెలాంగ్‌ ప్రాంతం రత్తొపొడా గ్రామానికి చెందిన మమతా పరిడాగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆమె భర్త దిలీప్‌ పరిడా విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు.

భూఆక్రమణ అడ్డగింత

సరుబుజ్జిలి: చిగురువలస పంచాయతీ శ్రీరాంవలస రెవెన్యూ గ్రామంలో 9–1, 9–3 సర్వే నంబర్లలో ఎకరా 60 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. ఈ గ్రామకంఠం భూమిని కొందరు స్థానికులు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వ్యక్తికి అనధికార విక్రయం చేసినట్లు సమాచారం. దీంతో కొనుగోలుదారుడు సదరు భూమిని చదును చేస్తుండగా చిగురువలస గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. స్థలం ప్రధాన గేటుకు తాళం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ భూములను ఇష్టార్యాజ్యంగా విక్రయాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులు వెంటనే పరిశీలించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై తహశీల్దార్‌ మధుసూదన్‌ వద్ద ప్రస్తావించగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు కృషి చేయాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారి సుధాకరరావు అన్నారు. శుక్రవారం జిల్లా మహిళా సమాఖ్య కార్యవర్గ సమావేశ మందిరంలో వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో ఉల్లాస్‌ కార్యక్రమంపై వలంటీర్లకు ఓరియంటేషన్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 ఏళ్లు దాటిన నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామాల్లో స్వచ్ఛందంగా వలంటీర్లు బోధన చేయాలన్నారు. వయోజన విద్యా జిల్లా ఉప సంచాలకుడు ఎ.సోమేశ్వరరావు మాట్లాడుతూ 11207 మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చి లక్షా 12 వేల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కార్యక్రమంలో ట్రైనర్లు కె.వెంకటరమణ, పి.వెంకటరమణ, డీఎల్‌డీఓ చంద్రకుమారి, వయోజన విద్యా ఏపీఓ బాలచంద్ర, పర్యవేక్షకులు ఎల్‌.రవణమ్మ పాల్గొన్నారు.

ఎరువుల కోసం ఆందోళన చెందవద్దు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందవద్దని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. శుక్రవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు రెండవ సారి ఎరువులు ఇంకా అందలేదని, ఎరువులు ఎప్పుడు వస్తాయని పలువురు రైతులు కలెక్టర్‌ను అడిగారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంత వరకు యూరియా తీసుకోని రైతులకు సంబంధిత మండల వ్యవసాయ అధికారులు వెంటనే యూరియా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రేపటి నుంచి హిందీ పక్షోత్సవాలు

శ్రీకాకుళం న్యూకాలనీ: ఈ నెల 14న జాతీయ హిందీ దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలో 15 రోజులపాటు హిందీ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్టు హిందీ వికాస వేదిక అధ్యక్షుడు మందపల్లి రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి నిరంజన్‌ ఖడంగా శుక్రవారం తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, కవుల వేషధారణలు, కవితాగానం, దేశభక్తి గేయాలు, చిత్రలేఖనం, ఉపాధ్యాయులకు ఉత్తరాలు, స్నేహితులకు లేఖలు, అందమైన చేతిరాత(సులేఖన్‌) పోటీలు, ఏకపాత్రాభినయం, నాటికలు, జాతీయ సమైఖ్యతాదాపకాల ప్రదర్శన వంటి పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని రామకృష్ణారావు, నిరంజన్‌ పేర్కొన్నారు. వివరాలకు 94416 49118 నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు.

16న పీడీఎస్‌ బియ్యం వేలం

కొత్తూరు: మండలంలో శ్రీకాకుళం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సివిల్‌ సప్లయ్‌ డీటీల తనిఖీల్లో పట్టుబడి సీజ్‌ చేసిన 390.50 కింటాళ్ల బియ్యాన్ని ఈ నెల 16న తహశీల్దార్‌ కార్యాలయంలో వేలం వేయనున్నట్లు తహశీల్దర్‌ కె.బాలకృష్ణ శుక్రవారం తెలిపారు. సీజ్‌ చేసిన బియ్యం సరుబుజ్జిలి మండలం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో ఉందని, కిలో ధర 42.5గా నిర్ణయించామని చెప్పారు. ఎటువంటి డిపాజిట్‌ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

జట్నీ – పిప్పిలి మార్గంలో మహిళ దుర్మరణం 1
1/1

జట్నీ – పిప్పిలి మార్గంలో మహిళ దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement