
పాఠశాల తరలింపుపై నిరసన
బూర్జ: అల్లెన ప్రాథమికోన్నత పాఠశాలను గ్రామంలోనే కొనసాగించాలని, వేరే పాఠశాలలో విలీనం చేయవద్దని కోరుతూ సర్పంచ్ జడ్డు మహేష్, విద్యార్థుల, తల్లిదండ్రులు, గ్రామస్తులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఇంత వరకు ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేయకపోవడం తగదన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం సమగ్ర శిక్ష ఏఎంఓ చిగురుపల్లి సుధాకరరావు, సీఎంఓ బొడ్డేపల్లి శ్రీధర్, ఐఈసీఓ గోవిందరావు వద్ద సమస్య వివరించారు. ఇక్కడి 3, 4, 5వ తరగతులను పాలవలస ప్రైమరీ మోడల్ స్కూల్‌కు, 6, 7, 8వ తరగతులను పాలవలస జెడ్పీ హైస్కూల్‌కు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. నాగావళి నది ఒడ్డున ఉన్న పాలవలస వెళ్లాలంటే సుమారు 12 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందని, అంతదూరం చిన్నారులు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. నిరసన కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు విద్యాకమిటీ చైర్మన్ మురపాక శంకరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.అనిత అన్నారు. శుక్రవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సీ్త్ర ఆరోగ్యంపై అవగాహన, చికిత్స, వైద్య పరీక్షలు, ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు స్వస్థనారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ద్వారా ఎన్.సి.డి స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్, ప్రసూతి సంరక్షణ, తల్లి, పిల్లల రక్షణ కార్డ్, ఇమ్యునైజేషన్, రక్తహీనత స్క్రీనింగ్, రుతు పరిశుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్టు వివరించారు.