
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన
భువనేశ్వర్: భారత ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఢిల్లీ బయల్దేరారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు ఢిల్లీలో పలు ప్రభుత్వ, సంస్థాగత కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొంతమంది కేంద్ర మంత్రులను కలవనున్నారు.
ఉప రాష్ట్రపతికి శుభాకాంక్షలు
భారత దేశ 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్‌కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత ప్రజాస్వామ్య విలువల పరిరక్షణతో పవిత్ర పార్లమెంటరీ సంప్రదాయాలను బలోపేతం చేసేందుకు అంకిత భావంతో పూర్తి పదవీకాలం సద్వినియోగం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
జేపీ నడ్డాతో చర్చ
ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ భారతీయ జనతా పార్టీ చీఫ్ – కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె. పి. నడ్డాను కలిశారు. రాష్ట్రంలో మంత్రి మండలి విస్తరణ ఉత్కంఠ నెలకొని ఉన్న సమయంలో జాతీయ శాఖ అధ్యక్షునితో భేటీ చర్చనీయాంశమైంది. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఈ భేటీ బలమైన సంకేతంగా పరిగణిస్తున్నారు. అలాగే వివిధ రాష్ట్ర నిర్వహణ కార్పొరేషన్లకు అధిపతుల జాబితాను ఖరారు చేయనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ కీలక నిర్ణయాలను రూపొందించడంలో పార్టీ జాతీయ నాయకత్వంతో చర్చలు కీలకమైనవిగా భావిస్తున్నారు. చర్చల సందర్భంగా, ముఖ్యమంత్రి ఒడిశా ప్రభుత్వం యొక్క ప్రజా కేంద్రీకత చొరవలు, ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలో మౌలిక ఆరోగ్య సదుపాయాల అభివద్ధి మరియు రాష్ట్ర ఆరోగ్య రంగం భావి రూపకల్పనపై వివరణాత్మక చర్చలు జరిపినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.