
మూడు వేల మెట్రిక్ టన్నుల ఎరువులేవీ?
● సర్వసభ్య సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ
ఇచ్ఛాపురం రూరల్: కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు జిల్లాకు మూడు వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందజేశామని చెబుతున్నారని, అవి ఎప్పుడు వచ్చాయి.. ఎంత మంది రైతులకు అందజేశారో తెలియజేయాలని జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ అన్నారు. శుక్రవారం ఇచ్ఛాపురం ఎంపీపీ బోర పుష్ప అధ్యక్షతన ఎంపీడీఓ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వ్యవసాయాధికారి పి.పి.వి.వి.అజేయ్‌కుమార్ వ్యవసాయ సమీక్షలో మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు దక్కత ఏకాంబరి కలగజేసుకొని కేంద్ర మంత్రి జిల్లాకు 3వేల టన్నుల ఎరువులు అందజేశారని, ప్రతిపక్షం కావాలనే ఆరోపణలు చేస్తోందన్నారు. మాజీ ఎంపీపీ కారంగి మోహనరావు, సర్పంచ్ పి.రాజశేఖర్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎరువులకు కొరత ఉండేది కాదని, కూటమి ప్రభుత్వంలో మాత్రం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని, ఒడిశాలో వెయ్యికి చొప్పున బస్తా యూరియాను కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఈ–క్రాప్ చేయలేదని, పంటలు నష్టపోయిన వారికి ఇన్‌పుట్ సబ్సిడీ అందించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని పలువురు సభ్యులు ఆరోపించారు. జెడ్పీ చైర్‌పర్సన్ విజయ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి రైతుకు ఎరువులు అందించామని, కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద ఆ పార్టీ సానుభూతిపరులకు మాత్రమే అందిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో బాహుదానదిపై సుమారు రూ.20 కోట్లతో కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు, అంచనా విలువలు, ఆమోదం పూర్తయితే కూటమి ప్రభుత్వం రద్దు చేయడం దారుణమన్నారు. ఒడిశాకు చెందిన వ్యక్తులు ఆంధ్రాలో ప్రయోజనం పొందుతున్నారని, అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు సమయపాలన పాటించడం లేదని, పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు ఇచ్చే సరుకులను అంగంట్లో అమ్మేస్తున్నారని సభ్యులు దక్కత ఏకాంబరి, దున్న గురుమూర్తిలు ఆరోపించారు. సమావేశంలో ఎంపీడీఓ కె.రామారావు, తహసీల్దార్ ఎన్.వెంకటరావు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.