
బీఆర్‌ఏయూ రిజిస్ట్రార్‌గా అడ్డయ్య
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా వర్సిటీ సీనియర్ అధ్యాపకుడు ఆచార్య బి.అడ్డయ్య నియమితులయ్యారు. ఈ మేరకు వర్సిటీ వీసీ ఆచార్య కె.ఆర్.రజని నియామక ఉత్తర్వులు బుధవారం అందజేశారు. ఇప్పటివరకు అడ్డయ్య వర్సిటీ రెక్టార్‌గా వ్యవహరించడమే కాకుండా, పలుమార్లు ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా సేవలను అందించారు.
గ్యాస్ సిలిండర్ నుంచి
మంటలు
నరసన్నపేట: స్థానిక మెయిన్ రోడ్డులోని వేంకటేశ్వర థియేటర్ సమీపంలో ఉన్నటువంటి ఎం.పాపారావు ఇంట్లో పెను ప్రమాదం తప్పింది. ఉదయం పాపారావు భార్య కుమారి పాలు మరిగిస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. కొన్ని సెకన్లలోనే మంటలు ఎగసిపడ్డాయి. దీంతో కుమారి భయంతో బయటకు పరుగులు తీసింది. వెంటనే స్థానికులు వచ్చి తడి గోనె సంచులు కప్పి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం తెలుసుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి, పరిశీలించి తగు సూచనలు చేశారు. కాగా ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదు.
28 పశువులు పట్టివేత
రణస్థలం: లావేరు మండలంలోని ఎన్‌హెచ్–16పై సుభద్రాపురం జంక్షన్‌లో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వెళ్తున్న రెండు ఐసర్ వ్యాన్‌లలో తరలిస్తున్న 28 పశువులను(గేదెలను) లావేరు పోలీసులు పట్టుకున్నారు. దీనిపై లావేరు ఎస్‌ఐ జి.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇద్దరిపై కేసు నమోదు
కొత్తూరు : నివగాం గ్రామానికి చెందిన బి.కమలహాసన్, బి.రాజేష్‌లు వెలుగు కార్యాలయంలోకి వచ్చి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అనుమతి లేకుండా వీడియోలు చిత్రీకరించారని ఏపీఎం లలిత పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇద్దరిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎండీ అమీర్ ఆలీ బుధవారం తెలిపారు.

బీఆర్‌ఏయూ రిజిస్ట్రార్‌గా అడ్డయ్య