
నిర్ణయాత్మక రాజకీయ శక్తిగా బీజేడీ
భువనేశ్వర్: ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన బి జూ జనతా దళ్ జాతీయ స్థాయి రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా వెలుగొందుతుంది. పలు జాతీయ సంక్లిష్ట పరిస్థితుల్లో భిన్నమైన వ్యూహాలతో తనదైన ఉనికిని చాటుకుంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఫలితాల ఆధారంగా రాష్ట్రంలో తొలి సారిగా విపక్ష హోదాతో సరికొత్త పోకడని చాటుకుంటుంది. ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ప్రదర్శించిన వ్యూహాత్మక నిర్ణయం చర్చనీయాంశమైంది.
విభిన్న శైలితో సమాన దూరం..
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేడీ ఎన్డీయే, ఇండి కూటమి నుంచి సమాన దూరం వ్యూహాన్ని విభిన్నంగా ప్రదర్శించింది. బిజూ జనతా దళ్ 2012లో తొలి సారిగా అనుసరించిన మునుపటి సమదూర విధానం 2022 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో విభిన్నంగా ప్రదర్శించింది. 2012లో రాష్ట్రపతి పోటీ కోసం పి.ఎ.సంగ్మా పేరును నవీన్ పట్నాయక్ ప్రకటించి బీజేడీ తరఫున మద్దతు అందించారు. అదే సంవత్సరం జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరమై ఎన్డీఏకు చెందిన జస్వంత్ సింగ్, యూపీఏకు చెందిన హమీద్ అన్సారీలో ఏ ఒక్కరికి మద్దతు ప్రకటించ లేదు. 2017లో ఎన్డీఏకు చెందిన రామ్ నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి గా, యూపీఏకు చెందిన గోపాలకృష్ణ గాంధీని ఉప రాష్ట్రపతిగా మద్దతు ఇవ్వడం ద్వారా బీజేడీ తన వైఖరిని జాగ్రత్తగా సమతుల్యం చేసుకుంది. తద్వారా రెండు జాతీయ కూటమిల నుంచి సమాన దూరాన్ని వ్యూహాత్మకంగా ప్రదర్శించి ఔరా అనిపించింది. ఆ తర్వాత 2022లో, ఎన్డీఏ అభ్యర్థులైన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్‌లకు మద్దతు ఇచ్చి విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేసింది. బీజేడీ వైఖరి స్పష్టమైన మార్పుతో ఊహాతీతంగా స్పందించింది. దీంతో బీజేపీ, బీజేడీ లోపాయికారీ మిత్ర కూటమి అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చెలరేగాయి. అయితే ఈ వైఖరి తదుపరి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైపరీత్యాన్ని ప్రేరేపిస్తాయని కొన్ని వర్గాలు చేసిన వ్యాఖ్య లు 2024 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఎదుర్కొన్న ఊహాతీత పరిణామాలు రుజువు చేశాయి. వక్ఫ్ బిల్లును ఆమోదించడంతో మరోసారి బీజేడీ శిబిరంలో తీవ్ర మనస్పర్దలు తలెత్తాయి. ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా తాజాగా జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటింగ్‌కు దూరం కావాలని నిర్ణయించింది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ నిర్ణయం తొలి రాజకీయ వ్యూహ రచనగా రాజకీయ పటిష్టతని ప్రతిబింబిస్తోంది.

నిర్ణయాత్మక రాజకీయ శక్తిగా బీజేడీ