
నువాపడా ఎమ్మెల్యే రాజేంద్ర ఢొలొకియా కన్నుమూత
భువనేశ్వర్: పశ్చిమ ఒడిశాలో ప్రముఖ రాజకీయ నాయకునిగా వెలుగొందిన రాజేంద్ర ఢొలొకియా (68) కన్ను మూశారు. మూత్రపిండాల సంబంధిత అనారోగ్యంతో చైన్నెలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చర ణ్ మాఝి, విపక్ష నేత, బిజూ జనతా దళ్ అధ్య క్షుడు నవీన్ పట్నాయక్, ఉప ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
శాసన సభ ముంగిట అంతిమ దర్శనం
చైన్నె ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన రాజేంద్ర ఢొలొకియా భౌతిక కాయాన్ని ఆకాశ మార్గంలో తరలించి రాష్ట్ర శాసన సభ ముంగిటకు మంగళవారం చేర్చనున్నారు. ఈ సందర్భంగా తోటి సభ్యులు, నాయకులు, సహచరులు, ఇతర ప్రముఖులు, అధికారులు అంతిమ దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
స్వతంత్ర పోరాటం
రాజేంద్ర ఢొలొకియా వరుసగా 4 సార్లు రాష్ట్ర శాసన సభకు ఎన్నికయ్యారు. పశ్చిమ ఒడిశా నువాపడా నియోజక వర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహించారు. బిజూ జనతా దళ్ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం శ్రీకారం చుట్టడం విశేషం. ఇటీవల ముగిసిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీ అభ్యర్థిగా పోటీ చేసి 61,822 ఓట్లతో విజయం సాధించి రాష్ట్ర శాసన సభకు ఎన్నికయ్యారు. ఆయన 2004 నుంచి 2009 వరకు స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా కొనసాగారు. తదుపరి బిజూ జనతా దళ్ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా 2 సార్లు జరిగిన ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు.
2009 నుంచి 2014, 2019 నుంచి 2024 వరకు నువాపడా నియోజక వర్గం నుంచి బిజూ జనతా దళ్ సభ్యునిగా కొనసాగారు. ఈ రెండు ఎన్నికల్లోనూ ఆయన బిజూ జనతా దళ్ టికెట్ నుంచి పోటీ చేసి గెలిచారు. 1956 నవంబర్ 20న జన్మించిన రాజేంద్ర ఢొలొకియా తన రాజకీయ జీవితాన్ని స్వతంత్ర అభ్యర్థిగా ప్రారంభించారు. 2004 ఎన్నికల్లో తొలి విజయం సాధించి రాష్ట్ర శాసన సభలో మొట్టమొదటి సారి అడుగిడారు. తర్వాత ఆయన బీజేడీలో చేరి 2009, 2019 2024లో మరో మూడు వరుస విజయాలు సాధించి పశ్చిమ ఒడిశా నుంచి కీలక నాయకుడిగా ఎదిగారు.