
నేత్రదానం చేయండి
● జిల్లా ఆస్పత్రి నేత్ర వైద్య నిపుణుడు
డా.వెంకటేష్
పార్వతీపురం టౌన్: నేత్రదానం చేసి చూపు లేని వారికి వెలుగునివ్వండని జిల్లా ఆస్పత్రి నేత్ర వైద్య నిపుణుడు డా. వెంకటేష్ కోరారు. ఈ మేరకు శనివారం జిల్లా ఆస్పత్రిలోని నేత్ర వైద్య విభాగంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ నేత్ర వైద్యాధికారి జీరు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కార్నియల్ అంధత్వంతో చూపు కోల్పోయిన వారికి నేత్ర దాతల నుంచి సేకరించిన కార్నియా మార్పిడి ద్వారా కంటి చూపును ప్రసాదించవచ్చున్నారు. కావున ప్రజలందరూ అవగాహన చేసుకుని నేత్రాలను దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. వ్యక్తి మరణానంతరం ఆరు గంటల్లోగా నేత్రాలను సేకరించాల్సి ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా సెప్టెంబరు 8 వరకు నిర్వహిస్తున్న నేత్రదాన పక్షోత్సవాల్లో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా నేత్రాలను సేకరించేందుకు అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నేత్ర వైద్యాధికారి కృష్ణారావు, జిల్లా ఎన్‌జీఓ అధ్యక్షుడు కిశోర్, శిక్షణ సిబ్బంది పాల్గొన్నారు.