
సమాజ నిర్దేశకులు
ఉపాధ్యాయులే..
● రాయగడ కలెక్టర్ అశుతోష్ కులకర్ణి
రాయగడ: ఉపాధ్యాయులే సమాజ నిర్దేశకులని రాయగడ జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దేది కూడా వారేనన్నారు. స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్యమంత్రి శిక్షా పురస్కార్–25 కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు మంచి భవిష్యత్‌ను అందించడంతోపాటు వారు సమాజంలో ఉన్నత స్థానాన్ని సంపాదించుకునేందుకు ఉపాధ్యాయుని పాత్ర చాలా కీలకమన్నారు. విద్యావిధానంలో ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులను అందుకోవడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. డ్రాపవుట్‌ల సంఖ్యను తగ్గించాలన్నారు. అందరూ చదువుకోవాలనే నినాదాలతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలోని 25 మంది ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి శిక్షా పురష్కార్–25 అవార్డులను ప్రదానం చేసి సత్కరించారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, జిల్లా విద్యాశాఖ అధికారి రామచంద్ర నాహక్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి అసీమా రావ్ పాల్గొన్నారు.
● స్థానిక సాయిప్రియ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో వి శ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ బాబూరావు మహాంతి దంపతులను సభ్యులు ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు సమాజానికి అందిస్తున్న సేవల గురించి వాకర్స్ క్లబ్ సభ్యులు ప్రశంసించారు.

సమాజ నిర్దేశకులు