
మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయండి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబే డ్కర్
విజయనగరం అర్బన్: జిల్లాలోని వివిధ సంక్షేమ వసతి గృహాలకు సెప్టెంబర్ నెలాఖరుకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. తన చాంబర్‌లో ఆర్‌డబ్ల్యూఎస్, సంక్షేమశాఖల ఉన్నతాధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా సంక్షేమ హాస్టళ్లకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 15 సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న 11 హాస్టళ్లలో ఆర్‌డబ్ల్యూఎస్, పట్టణ ప్రాంత హాస్టళ్లల్లో పబ్లిక్ హెల్త్ విభాగం వారు మరుగుదొడ్లు నిర్మించాలని ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 39 హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని కోరారు. గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని 149 హాస్టళ్లలో ఎన్ని చోట్ల మరుగుదొడ్లు అవసరమన్నది సర్వేచేయాలని సూచించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఎస్.కవిత, జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారిణి అన్నపూర్ణ, బీసీ సంక్షేమ శాఖాధికారిణి జ్యోతిశ్రీ, గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పైడితల్లి అమ్మవారి హుండీల ఆదాయం లెక్కింపు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి వనంగుడి, చదురుగుడి హుండీల ఆదాయాన్ని గురువారం పైడితల్లి అమ్మవారి కల్యాణ మంటపంలోను, వనంగుడి ఆవరణలో లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ కె.శిరీష మాట్లాడుతూ 44 రోజులకు గాను చదురుగుడి హుండీల నుంచి రూ.15 లక్షల 62వేల 461 నగదు, 12 గ్రాముల350 మిల్లీ గ్రాముల బంగారం, 216 గ్రాముల వెండి లభించాయన్నారు. అదేవిధంగా వనంగుడి హుండీల నుంచి రూ.3 లక్షల 64వేల 803 నగదు, అన్నదానం హుండీ ద్వారా రూ.8750 ఆదాయం లభించిందన్నారు. భక్తులు ఆలయ అభివృద్ధికి మరింత సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వైవీ.రమణి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
13న జాతీయ లోక్ అదాలత్
విజయనగరం లీగల్: స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అదాలత్‌లో వాహన ప్రమాదాలు, బ్యాంకులకు సంబంధించిన కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎన్‌ఐఏ, ఎకై ్సజ్ కేసులు, కుటుంబ వివాదాలు, కార్మిక సంబంధిత సివిల్ కేసులను కూడా పరిష్కరించుకోవచ్చన్నారు. పూల్‌బాగ్ కాలనీ హనుమాన్ నగర్‌లోని ఎంఆర్‌వీజీఆర్ పీజీ బాయ్స్ హాస్టల్ ప్రాంగణంలోని నూతన కోర్టు భవనంలో ఆరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆయన చూపు సజీవం
చీపురుపల్లి: బతికున్నప్పుడు మాత్రమే కాదు మరణించిన తరువాత కూడా చూపు సజీవంగా ఉండాలంటే నేత్రాలు దానం చేయాలి. ప్రతి మనిషి మరణానంతరం శరీరంతో పాటు అవయవాలు కూడా కాలి బూడిదవ్వాల్సిందే. కానీ ఆ చూపు సజీవంగా ఉండాలంటే మాత్రం నేత్రాలు దానం చేయాలి. పట్టణంలోని మెయిన్‌రోడ్‌కు చెందిన రిౖటైర్డ్ ఉపాధ్యాయుడు బీఎస్.అప్పలనాయుడు కుటుంబసభ్యులు అదే పని చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. పట్టణంలోని ఆంజనేయపురానికి చెందిన బీఎస్.అప్పలనాయుడు(86) బుధవారం రాత్రి ఆకస్మికంగా మృతిచెందారు. దీంతో పట్టణానికి చెందిన మానవీయత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు బీవీ గోవిందరాజులు నేత్రదానం చేయాలంటూ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దీనికి వారు అంగీకరించడంతో విజయనగరం రెడ్‌క్రాస్ సంస్థకు సమాచారం ఇవ్వగా అక్కడి నుంచి టెక్నీషియన్ రమణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి నుంచి కార్నియా సేకరించారు.
పారిశుధ్య వాహనాలు ప్రారంభం
విజయనగరం: స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలను ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు నగరంలో గురువారం ప్రారంభించారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా రూ.3.57 కోట్ల వ్యయంతో ఓ జేసీబీ, రెండు కాంపాక్టర్ వాహనాలు సహా ఎనిమిది ట్రాక్టర్లు కొనుగోలు చేయడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకుని స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమ లక్ష్యం నెరవేరేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో కమిషనర్ పల్లి నల్లనయ్య, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, ఈఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయండి