
ప్రాణాలు తీసేస్తున్న డీజేలు
విజయనగరం క్రైమ్: ఆనందాలు కాస్త ఆవిరవుతున్నాయి. సరదాలు మితిమీరుతున్నాయి. పండగలు ప్రాణాలు తీస్తున్నాయి. సాంస్కృతిక వైభవం చాటాల్సిన కార్యక్రమాల్లో విషాద ఛాయలు అలముకుంటున్నాయి. మారుతున్న కాలంలో సంప్రదాయాలను చాటిచెప్పాల్సిన పండగలలో సమష్టి కృషి, సమైక్య పనితనం మచ్చుకై నా కానరావడం లేదు. ఖర్చులు పెడుతున్నామనే భావన తప్ప భక్తి, ఆ పై సంస్కృతి పరిఢ విల్లడం లేదు. విజయనగరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో వారం రోజులుగా అయిదు పోలీస్ స్టేషన్ల పరిధిలో అలాంటి ఘటనలే జరుగుతుండడం దారుణం. ఇటీవల విజయనగరం వన్ టౌన్ స్టేషన్ పరిధి కొత్త దుప్పాడలో ఓ యువకుడి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. వినాయక నిమజ్జనం ఉత్సవాల్లో పెట్టిన భారీ శబ్దాలు (డీజే) ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడిని బలిగొన్నాయి. నిన్నకాక మొన్న విజయనగరం వన్ టౌన్ స్టేషన్ పరిధిలో ఒకటి, టూటౌన్ పీఎస్ లో ఒకటి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరు వినాయక నిమజ్జనాల్లో పాల్గొని సంభ్రమాశ్చర్యాల్లో మునిగి చివరకు కన్నవారికి దూరమయ్యారు. తాజాగా విజయనగరంలోని బొబ్బాదిపేటకు చెందిన బొబ్బాది హరీష్ (22) వినాయక నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్స్‌కు బుధవారం రాత్రి డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. డిగ్రీ పూర్తి చేసిన హరీష్ పోటీ పరీక్షలకు కోచింగ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో ఈ దారుణ ఘటన జరిగింది.
శ్రుతిమించుతున్న శబ్దాలు