
ఉత్కళ క్యాంపస్‌లో ఉద్రిక్తత
● గేట్లకు తాళం వేసి విద్యార్థుల నిరసన
● అనధికార వ్యక్తులు చొరబడితే
సహించం: మంత్రి
భువనేశ్వర్: స్థానిక ఉత్కళ విశ్వ విద్యాలయం గోపబంధు హాస్టల్‌లో మంగళవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. వార్డెన్ చర్యలకు వ్యతిరేకంగా పలువురు విద్యార్థులు గేట్లకు తాళం వేసి నిరసన తెలిపారు. విద్యార్థేతర వర్గాలు హాస్టల్ ఖాళీ చేయాలని వార్డెన్ ఆదేశించడంతో ఈ ఉద్రిక్తత ఏర్పడింది. విశ్వవిద్యాలయ ప్రాంగణం నుంచి మురికివాడలను తొలగించాలని విద్యార్థేతర వర్గాలు ఎదురు దాడికి దిగాయి. ఈ వర్గాలు ఉద్దేశపూర్వకంగా విశ్వవిద్యాలయంలోని హాస్టల్‌లకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించారు. స్థానిక సాహిద్ నగర్ ఠాణా పోలీసులు, మీడియా చొరవని అడ్డుకుని ఆందోళన కొనసాగించారు. వాణీవిహార్ ఉత్కళ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో తలెత్తిన ఉద్రిక్తతని ప్రేరేపించిన పరిస్థితులపై అధికారులు, అనుబంధ వర్గాలతో చర్చలు జరుగుతున్నాయని భువనేశ్వర్, కటక్ జంట నగరాల పోలీస్ కమిషనర్ దేవదత్ సింగ్ తెలిపారు. అంతర్గత వ్యవహారాలతో ఈ ఉద్రిక్తత తలెత్తినట్లు ప్రాథమిక సమాచారం. పరిస్థితి అదుపు చేసేందుకు స్థానిక సాహిద్ నగర్ ఠాణా పోలీసుల బృందం ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో నిరసనకారులు రాళ్లు రువ్వడంతో ప్రాంగణం లోనికి ప్రవేశించలేకపోయారు.
మురికివాడలు కూల్చండి..
ఉత్కళ క్యాంపస్‌లోనికి పరిసరాల్లో బీదలవాడ ప్రజలు అనధికారికంగా చొరబడి విద్యార్థులకు కేటాయించిన హాస్టలు గదుల్లో చొరబడ్డారు. వారందరినీ తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించడంతో బీదలవాడ వర్గీయులు భగ్గుమన్నారు. క్యాంపస్ పరిసరాల్లో మురికివాడ తొలగించిన తర్వాత ఆదేశాలు జారీ చేయాలని ఎదురు దాడికి దిగారు. పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థుల 3 యూనిట్ల హాస్టలు గదుల్లో బీదల వాడ ప్రజలు అనధికారికంగా చొరబడి తిష్ట వేశారు. వారంతా ఈ నెల 4న లేదా అంతకు ముందు తమ వస్తువులతో సహా గదులను ఖాళీ చేయాలని హాస్టల్ వార్డెన్ ఆదేశించారు. ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడిన వారి వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపడతామని స్పష్టంగా హెచ్చరించారు. మరో వైపు విద్యార్థి వర్గాలకు హాస్టలు వార్డెన్ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. హాస్టలు గదులను ఇతరులకు అద్దెకు కేటాయించడం నిషేధమని, ఈ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన విద్యార్థుల రిజిస్ట్రేషను పూర్తిగా రద్దు చేసి క్యాంపస్ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.
అనధికారిక చొరబాటులు సహించం..
విశ్వవిద్యాలయంతో సంబంధం లేని వారు క్యాంపస్‌లో అడుగుపెడితే సహించేది లేదని రాష్ట్ర ఉన్నత విద్యా విభాగం మంత్రి సూర్యవంశీ సూరజ్ స్పష్టం చేశారు. క్యాంపస్‌లో ఆరోగ్యవంతమైన విద్యా వాతావరణం పరిరక్షణ పట్ల వైస్ చాన్సలర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. బీదల వాడల ప్రజలు క్యాంపస్ లోనికి చొరబడడం తగదన్నారు.హద్దు మీరితే కఠిన చర్యలు చేపట్టడంలో వెనుకంజ వేసేది లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థులకు అనుకూలంగా, వారి భద్రత కోసం నిబద్ధతతో వ్యవహరిస్తుందని చెప్పారు.