
భువనేశ్వర్: మయూర్‌భంజ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికలకు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అభ్యర్థిగా అంజనీ సోరెన్‌ను ప్రకటించారు. అంజనీ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సొరేన్ కుమార్తె. ఈ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన నొబొ చరణ్ మాఝీ, బీజేడీకి చెందిన సుదామ్ మరాండీతో ఆమె ఎన్నికల్లో తలపడనున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంత జిల్లా అయినందున మయూర్‌భంజ్‌కు ఎన్నికల్లో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈసారి జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భారతీయ జనతా పార్టీ దృఢ సంకల్పంతో పని చేస్తోంది. లోగడ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి బిశ్వేశ్వర టుడు, అంతకుముందు 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేడీ అభ్యర్థి రామచంద్ర హంసదా ఈ నియోజకవర్గం నుంచి గెలిపొందారు.
కాళీరాంకు ఘన స్వాగతం
రాయగడ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కొరాపుట్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం కాళీరాం మాఝికి టిక్కెట్టు ఖరారు చేయడంతో, జిల్లాలోని టికిరిలో ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాళీరాం మాఝి మాట్లాడుతూ బీజేడీలో వర్గ విభేదాలతో ఆ పార్టీ నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయని, రానున్న ఎన్నికల్లో విజయం ఖాయమని పేర్కొన్నారు. కొరాపుట్ లోక్‌సభ స్థానం నుంచి తనను గెలిపించాలని కొరారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ పట్నాయక్, రాష్ట్ర శాఖ కార్యవర్గ సభ్యుడు బసంత కుమార్ ఉలక, యువనేత ప్రతాప్ పువల, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
రాయగడ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా టుటూ దాస్
రాయగడ: రాయగడ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పద్మనాభ (టుటూ) దాస్ ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన సునీల్ నాయక్, నవ కిషొర్ కంట, అరుణ్ పాణిగ్రహి లు అధికారికంగా ప్రకటించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ 12 గంటలకు ముగిసింది. మధ్యాహ్నం 4 గంటలకు ఓట్ల లెక్కింపు జరిగింది. 2024–25 ఏడాదికి గాను రాయగడ బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పద్మనాభ దాస్ (టుటు), పి.జగన్మోహన్‌రావు, బిభూది ప్రధాన్‌లు ఎన్నికల బరిలో నిల్చున్నారు. టుటు దాస్‌కు 59 ఓట్లు, జగన్‌మ్మోహన్‌రావుకు 56 ఓట్లు, బిభూది ప్రధాన్‌కు 49 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యక్షులుగా ఎద్దు శ్రీనివాస్‌రావు, సాధారణ కార్యదర్శిగా బిశ్వనాథ్ గంతాయిత్‌లు ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, సహ కార్యదర్శి పదవికి గేదెల కిశోర్, శుభక్రాంతి బెహరాలు పోటీపడ్డారు. వీరిలో శుభ్రకాంతి బెహరా విజయం సాధించారు. కోశాధికారిగా నీలాంచల్ బిసొయి ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికై న కార్యవర్గాన్ని న్యాయవాదులు అభినందించారు.
బీజేడీలోకి మాజీ ఎమ్మెల్యే సూర్యారావు
పర్లాకిమిడి: గజపతి జిల్లా పర్లాకిమిడి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కెంగం సూర్యారావు శనివారం బీజేడీ పార్టీలో చేరారు. భువనేశ్వర్‌లో జరిగిన బీజేడీ మిశ్రణ్ పర్వ్‌లో రాష్ట్ర మంత్రి అతాను సవ్యసాచి నాయక్, ఎమ్మెల్యే ప్రణబ్ ప్రకాష్ దాస్, బీజేడీ పార్టీ వ్యవహారాల అధ్యక్షుడు మానస రంజన్ మంగరాజ్, గజపతి జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. సూర్యారావు చేరికతో బీజేడీ మరింత బలోపేతమైందని మానస రంజన్ మంగరాజ్ అన్నారు. సూర్యారావుతో పాటు ఆయన అనుచరులు కూడా చేరారు.

సమావేశంలో మాట్లాడుతున్న కాళీరాం మాఝి తదితరులు

ఎన్నికై న కార్యవర్గంతో న్యాయవాదులు

అంజనీ సొరేన్