మూడు దశల్లో పంచాయతీ..
స్థానిక ఎన్నికలకు మోగిన నగారా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇక నగరాలు, పట్టణాలు, పల్లెలు మోతమోగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముందుగా మునిసిపల్ ఎన్నికలు, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తర్వాత మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో బుధవారం నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. విజయవాడ, మచిలీపట్నం కార్పొ రేషన్లతో పాటు జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, కొండపల్లి, పెడన, ఉయ్యూరు మునిసిపాలిటీలకు 16వ తేదీ నుంచి నామినేషన్లు ప్రారంభం అవుతాయి. 18వ తేదీ ఆదివారం సాయంత్రం మూడు గంటలకు నామినేషన్లు ముగుస్తాయి. 19వ తేదీన స్కూృటిని జరుగుతుంది. 21వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ విత్డ్రా చేసుకోవడానికి గడువు ఉంది. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 28వ తేదీ ఎన్నికలు కాగా, ఎక్కడైనా రీపోల్ అవసరం అయితే 29న జరుగుతాయి. కౌంటింగ్ 30వ తేదీన జరుగుతుంది. తాడిగడప, గుడివాడ మునిసిపాలిటీలకు ఎన్నిక వాయిదా పడింది. కోర్టు కేసు ముగిసిన తర్వాత డిసెంబర్లోగా ఈ రెండింటికీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది.
కూటమిలో అయోమయం..
ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ జనరల్కి, మచిలీపట్నం కార్పొరేషన్ బీసీ మహిళకు కేటాయించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ సీపీ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనలో దూకుడుగా వెళ్తోంది. మచిలీ పట్నం కార్పొరేషన్లో 60 స్థానాలకు గాను ఇప్పటికే 58 స్థానాలను ప్రకటించి పోటీలో ముందుంది. కూటమిలో పొత్తులు ఇప్పటి వరకూ ఖరారు కాకపోవడంతో ఆ పార్టీలలో కొంత అయోమయం నెలకొంది.
● మచిలీపట్నంలో గతంలో ఉండే 50 డివిజన్లను 60 డివిజన్లకు పెంచారు. దీని ప్రకారం నగరంలో 1,39,426 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళా ఓటర్లు 71,465 మంది, పురుష ఓటర్లు 67,781 మంది ఉన్నారు. పోలింగ్ నిర్వహణకు నగరంలోని 60 డివిజన్లకు సంబంధించి 58 ప్రాంతాల్లో 161 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు
● విజయవాడ మేయర్ సీటును జనసేనకు ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీలో ఉన్న వంగవీటి రాధ జనసేన కండువా కప్పుకొన్నారు. ప్రస్తుతం 64 నుంచి 86 డివిజన్లుగా విజయవాడ నగరం రూపుదిద్దుకుంది. నగరంలో మూడు సర్కిళ్ల పరిధిలో మొత్తం 8,05,797 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 3,94,732 మంది ఉండగా 4,10,918 మంది సీ్త్రలు ఉన్నారు. ఇతరులు 87 మంది ఉన్నారు. బీసీలు 3,58,742 ఉండగా, ఎస్సీలు 91,932, ఎస్టీలు 9542, ఓసీలు 3,45,581 మంది ఉన్నారు.
మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 19న నోటిఫికేషన్ విడుదల కానుంది. 21 నుంచి 23 వరకూ నామినేషన్లు, 24న స్కూృటిని, రిజెక్ట్ అయిన నామినేషన్లకు సంబంధించి 25న అప్పీల్ చేసుకునే అవకాశం 25న, 26న అప్పీల్ను పరిష్కరించేందుకు, 27 విత్డ్రా, పోటీలో ఉన్న జాబితా ప్రకటన, నవంబర్ మూడున ఎన్నికలు, ఐదున కౌంటింగ్ ఉంటుంది. పంచాయతీ ఎన్నికలు నవంబర్ 26, 29, డిసెంబర్ 02న మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల గెజిట్లను ప్రభుత్వం ప్రకటించింది.
నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్
మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ
28న మునిసిపల్, వచ్చే నెల 3న
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
ఒక్కసారిగా వేడెక్కిన జిల్లా రాజకీయం
అభ్యర్థుల ప్రకటనలో ముందున్న వైఎస్సార్ సీపీ
అమల్లోకి ఎన్నికల కోడ్


