అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): కళాకారుల శాసీ్త్రయ నృత్యాలు, సినీ గీతాలు, సందర్శకుల ఆటపాటలతో విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య (ఎంబీ) మునిసిపల్ స్టేడియం సందడిగా మారింది. దసరా మహోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్‌లో నాలుగో రోజు బుధవారం చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు నగర ప్రజలను అలరించాయి. బుధవారం నాటి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ ఉత్సవాల నిర్వహణను అభినందించారు. విజయవాడకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఈ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ విజయవాడ ఉత్సవ్–2.0తో పాటు నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా మహిళా సాధికారతకు, గ్రామీణ ఉత్పత్తుల ప్రోత్సాహానికి వేదికగా నిలుస్తోందని, స్థానిక కళాకారులకు ప్రోత్సాహం అందించడం ఈ ఉత్సవాల లక్ష్యాలని పేర్కొన్నారు. కమలేష్ పాశ్వాన్‌ను ఘనంగా సత్కరించారు.


