రాష్ట్రపతి పర్యటనఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి పర్యటనఏర్పాట్ల పరిశీలన

Oct 9 2026 2:02 AM | Updated on Oct 9 2026 2:02 AM

రాష్ట్రపతి పర్యటనఏర్పాట్ల పరిశీలన 10న చలో లోక్‌భవన్‌ నిత్యాన్నదానానికి విరాళాలు సోలార్‌ విద్యుత్‌తో బిల్లు ఆదా

విమానాశ్రయం(గన్నవరం): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14, 15 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్సీ వి.విద్యాసాగర్‌నాయుడుతో కలిసి గన్నవరం విమానాశ్రయంలో ముందస్తు భద్రత ఏర్పాట్లపై అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ.. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ముందస్తు తనిఖీలు, ట్రాఫిక్‌ నియంత్రణ, వీఐపీల వాహన పార్కింగ్‌ తదితర ఏర్పాట్లను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. నిరంతర విద్యుత్‌ ఉండేలా ఏపీ సీపీడీసీఎల్‌ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, విమా నాశ్రయ సీఎస్‌ఓ కె.ధర్మేంద్ర, ఇంటిలిజెన్స్‌ విభాగాధికారి చప్పిడి రాజా, జాతీయ రహదారుల సంస్థ పీడీ విద్యాసాగర్‌ పాల్గొన్నారు.

కృష్ణలంక(విజయవాడతూర్పు): దేశంలో అర్హులైన పౌరుల ఓట్లను విచక్షణారహితంగా తొలగించడాన్ని నిరసిస్తూ, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్‌కుమార్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల పదో తేదీన విజయవాడలో చలో లోక్‌భవన్‌ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ప్రకటించారు. గవర్నర్‌పేట బాలోత్సవ భవన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో చలో లోక్‌భవన్‌ పోస్టర్లు ఆవిష్కరించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ.. ఓటు హక్కు పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా యువత చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలి పారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నాసర్‌జీ మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయత మసకబారేలా ప్రవర్తించిన సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్నారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ.. ప్రశ్నించే యువత గొంతు నొక్కేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి యుగంధర్‌, పీడీఎస్‌యూ నాయకుడు నాని, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు శ్రీనివాస్‌, ఏఐడీఎస్‌ఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్‌, పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర, ఐసా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గురువారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేటకు చెందిన రామోజీ లోహాచారి కుటుంబ సభ్యులు రామోజీ బాబూరావు పేరిట నిత్యాన్నదానానికి రూ.1,01,023, గన్నవరానికి చెందిన గొల్లపూడి శ్రీనివాసరావు, రమ్యకృష్ణ దంపతులు రూ.1,00,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్‌ రాధాకృష్ణ, ఆలయ పర్యవేక్షకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ప్రధానమంత్రి సూర్య ఘర్‌ ముప్త్‌ బిజిలి యోజన అమలులో భాగంగా ఏపీసీపీడీసీఎల్‌ పరిధి లోని గుణదలలో నిర్వహిస్తున్న సేవా సేతు అభియాన్‌ క్యాంప్‌ను సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ కె.లింగమూర్తి గురువారం సందర్శించారు. క్యాంప్‌నకు వచ్చిన వినియోగదారులతో మాట్లాడారు. వినియోగదారులకు అధికారులు అందిస్తున్న సమాచారం, దరఖాస్తు ప్రక్రియ, సోలార్‌ వ్యవస్థ ఏర్పాటు అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ ఇళ్లపై రూఫ్‌టాప్‌ సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సౌర విద్యుత్‌ వినియోగం ద్వారా విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చునని పేర్కొన్నారు. ఏపీసీపీడీసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు రత్నకుమారి, విశ్వేశ్వరప్రసాద్‌, గుణదల అసిస్టెంట్‌ ఇంజినీర్‌ మురళీకృష్ణ, సౌర విద్యుత్‌ సంస్థల ప్రతినిధులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement