బియ్యం పంపిణీలో రేషన్ డీలర్లకు ఇబ్బందులు రేషన్ షాపుల చుట్టూ కార్డుదారుల ప్రదక్షిణలు
రేషన్ దుకాణాలకు వస్తున్న బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ స్లిప్పులు ఉంటున్నాయి. ఈ స్లిప్పులను స్కాన్ చేస్తేనే సరుకుల వివరాలు ఈపోస్ మిషన్‌లో చూపుతాయి. అప్పుడు మాత్రమే కార్డుదారులకు బియ్యం పంపిణీచేసేందుకు వీలవుతుంది. అన్ని బస్తాలపై ఉన్న క్యూఆర్ కోడ్ స్లిప్పులు స్కాన్ కావటం లేదు. దీనికి కారణం రైస్‌మిల్ నుంచి వచ్చేటప్పుడు స్కాన్ స్లిప్‌లపై మిషన్ కుట్లు వేసి ఉంటున్నాయి. దీంతో కోడ్ దెబ్బతింటోంది. మరికొన్ని బస్తాలకు క్యూఆర్ కోడ్ స్లిప్‌లు లేకపోవడం వల్ల ఆ బస్తాలు స్కాన్ కావటం లేదు. వీటిని మాన్యువల్‌గా స్కాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే అవి నో స్కాన్ అని చూపిస్తున్నాయి. దీనివల్ల ఈపోస్ మిషన్‌లో స్టాక్ వివరాలు చూపించటం లేదు. దీంతో కొంత మంది డీలర్లు బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేయలేకపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రేషన్ డీలర్లను క్యూఆర్ కోడ్ కష్టాలు వెంటాడుతున్నాయి. కనీసం శిక్షణ లేకుండా అమలు చేయడం వల్ల రేషన్ లబ్ధిదారులు సరుకుల కోసం రేషన్ షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ విధానంపై రాష్ట్రంలో డీలర్లకు కనీస అవగాహన కల్పించకుండా అమలు చేస్తున్నారు. ఫలితంగా క్షేత్ర స్థాయిలో డీలర్లు, కార్డుదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోడ్ స్కానింగ్ వల్ల వృద్ధాప్యంలో ఉన్న దివ్యాంగ డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. దశల వారీగా కాకుండా ఒకేసారి రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో అమలు చేస్తున్నారు. ఈ విధానంపై అవగాహన లేకపోవ డంతో డీలర్లతోపాటు, కార్డుదారులు కూడా రేషన్ షాపుల చుట్టూ నాలుగైదు సార్లు తిరగాల్సి వస్తోంది.
వాయిదా కోసం వినతి
క్యూఆర్ కోడ్‌ల సమస్యను పరిష్కరించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు డీలర్లు విజ్ఞప్తి చేశారు. సులభంగా స్కాన్ చేసుకునే పరికరాలు ఇస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఆ పరికరాలు అందుబాటులోకి వచ్చే వరకూ క్యూఆర్ కోడ్ స్కానింగ్ ప్రక్రియను వాయిదా వేసి డీలర్లకు, కార్డుదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని డీలర్ల అసోసియేషన్ నేతలు కోరుతున్నారు. కమిషనర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి ఎంఎల్‌ఎస్ పాయింట్లలో ఏర్పాటు చేసిన 3.50 టన్నుల కాటాపై డీలర్ల సమక్షంలో 100 శాతం తూకం వేసి బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఈ ఆదేశాలు చాలా ఎంఎల్‌ఎస్ పాయింట్లలో అమలు జరగడం లేదు. తూకం వేయకుండా ఆఫ్‌లైన్ తూకం బిల్లులు ద్వారా పంపిణీ చేస్తున్న ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జ్‌లపై చర్యలు తీసుకో వాలని అసోసియేషన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. క్యూఆర్ కోడ్‌లో జరిగే ఆలస్యం వల్ల 26వ తేదీ నుంచి ఒకటో తేదీ వరకూ వృద్ధులు, దివ్యాంగులకు బియ్యం డోర్ డెలివరీకి అంతరాయం కలుగుతోంది. కొంత మంది కార్డుదారులు క్యూఆర్ కోడ్ సమస్యలతో బియ్యం సకాలంలో అందక డీలర్లపై గొడవకు దిగుతున్నారు. కార్డుదారులు, డీలర్లకు ఇబ్బందులు లేకుండ నూతన స్కానింగ్ పరికరాలు ఇచ్చేవరకు పైలెట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక షాప్ చొప్పున అమలు చేసి డీలర్లకు అవగాహన కల్పించాలని రాష్ట్ర రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు దివి లీలా మాధవరావు కోరారు. క్యూర్ కోడ్‌లో స్కానింగ్ ప్రక్రియలో ప్రాక్టికల్‌గా ఎదురయ్యే ఇబ్బందులు పరిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని విజ్ఞప్తిచేశారు.


