మధురానగర్ (విజయవాడ సెంట్రల్): హెచ్‌ఐవీ ఎయిడ్స్‌పై యువతతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో 5కే మారఽథాన్ రెడ్‌రన్ రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయి. జిల్లాస్థాయి విజేతలకు నిర్వహించిన ఈ పోటీలను ఏపీశాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.స్మరణరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత భాగస్వామ్యంతోనే హెచ్‌ఐవీని అదుపు చేయగలమని చెప్పారు. ఈ పోటీల్లో మొదటి మూడుస్థానాలు సాధించినవారికి రూ.35 వేలు, రూ.25 వేలు, రూ.10 వేల చొప్పున బహుమతులు ఇవ్వడంతోపాటు జాతీయస్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. ఈ పోటీల్లో పురుషుల విభాగంలో మన్యం జిల్లాకు చెందిన ఎం.నరేష్, ఎన్.నిరంజన్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కె.మణికంఠ, మహిళల విభాగంలో బాపట్ల జిల్లాకు చెందిన ఇ.స్వాతి, మన్యం జిల్లాకు చెందిన బి.స్పందన, విశాఖ జిల్లాకు చెందిన జి.గాయత్రి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఈ కార్యక్రమంలో ఏపీశాక్స్ ఏపీడీ కె.భాగ్యలక్ష్మి, జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ టి.మంజుల, డాక్టర్ శ్రీనివాస్ వర్మ, సుకుమార్, ఎన్టీఆర్ జిల్లా డీఎల్‌ఏటీ అధికారి డాక్టర్ భానూనాయక్, కె.కోటేశ్వరరావు, కొల్లేటి రమేష్, డాక్టర్ రాజేంద్రప్రసాద్, అరవ రమేష్, ఏపీ శాక్స్, దిశ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


