కూటమి శ్రేణుల అత్యుత్సాహం.. ప్రజలకు శాపం
గంటల తరబడి వాహనాలు కదలక అవస్థలు
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యల్లో యంత్రాంగం విఫలం
పునాదిపాడులో హైస్కూల్ ప్లస్ భవనం ప్రారంభించిన మంత్రి లోకేష్
కంకిపాడు: రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటన ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తెచ్చిపెట్టింది. గంటల తరబడి వాహనాలు కదలక మండు టెండలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టీడీపీ, కూటమి శ్రేణులు అత్యుత్సాహంతో రోడ్లపై హడావుడి చేయటంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో పోలీసు అధికారులు విఫలం చెందటంతో ప్రజలు ట్రాఫిక్ కష్టాలు చవిచూశారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో సోమవారం మంత్రి లోకేష్ పర్యటన ప్రజలకు శాపంగా పరిణమించింది. లోకేష్ పర్యటన సందర్భంగా ఈడుపుగల్లు ప్రధాన కూడలి నుంచి పునాదిపాడు వరకూ టీడీపీ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. చిన్నబాబు మెప్పు కోసం టీడీపీ నేతలు పడరాని పాట్లు పడ్డారు. ఒక్కొక్కరికి రూ.500 నుంచి రూ.1000 చొప్పున కూలి ఇచ్చి గ్రామాల నుంచి మహిళలు, పురుషులను ఆటోల్లో తరలించి బల నిరూపణ చేసుకునేందుకు తాపత్రయ పడ్డారు. దీనికి తోడు తల్లికి వందనం వర్తింప చేసినందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు విద్యా శాఖ మంత్రికి ధన్యవాదాలు చెప్పాలని రోడ్లపైకి తీసుకొచ్చారు. ఒక్కో డ్వాక్రా వీఓఏ 30 నుంచి 50 మందిని తరలించా లంటూ ముందుగానే ఆ గ్రామాల నేతలతో హుకుంలు జారీ చేశారు. చేసేది లేక బుక్ కీపర్లు డ్వాక్రా సంఘాల సభ్యులను లోకేష్ ర్యాలీకి తీసుకెళ్లారు. తరలివచ్చిన ప్రజలను చూసుకుని టీడీపీ, మిత్ర కూటమి పక్షాలు రెచ్చిపోయాయి. జాతీయ రహదారిలో బైక్‌లపై రయ్ రయ్ మంటూ చక్కర్లు కొడుతూ నడిరోడ్డుపై ఫీట్లు చేశారు. బేతాళ నృత్యాలు, బైక్ స్టంట్లు, రోడ్డుపై అడ్డగోలు పార్కింగ్‌లతో ఓ వైపు రోడ్డు మార్గం పూర్తిగా మూసుకుపోయింది. దీంతో మరో వైపు ఎదురెదురుగా వాహనాలను మళ్లించటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. గంటల తరబడి వాహనాలు కదలక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవటం వల్లే ఈ సమస్య ఏర్పడిందని, అధికార పక్ష శ్రేణుల హడావుడిని నియంత్రించటంలో వైఫల్యం కనిపించిందంటూ పలువురు విమర్శిస్తున్నారు.
హైస్కూల్ ప్లస్ భవనం ప్రారంభం
పునాదిపాడు జెడ్పీ పాఠశాల ప్రాంగణంలో దాత పోలవరపు మాధవరావు, ఇతర కుటుంబ సభ్యులు రూ.1.20 కోట్లతో నిర్మించిన హైస్కూల్ ప్లస్ భవనాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం ప్రారంభించారు. లేబొరేటరీని సందర్శించి, వసతులను పరిశీలించారు. దాత, కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. అభ్యసన సామర్థ్యాల్లో విద్యార్థులు వెనుకబడి ఉండటంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, కామినేని శ్రీనివాస్, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, శాసనమండలి చీఫ్ విప్ అనూరాధ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కలెక్టర్ డీకే బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అయానా ఫంక్షన్ హాలులో నిర్వహించిన పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు.
యువరాజును ప్రసన్నం చేసుకునేందుకు సామంతరాజులు, సేనాపతులు ఎవరికి వారు పోటీలు పడ్డారు. కూలి డబ్బులు ఇచ్చి కొందరిని తరలించారు. తల్లికి వందనం ఇచ్చినందుకు మంత్రికి కృతజ్ఞతలు చెప్పాలంటూ అంగన్‌వాడీలను రప్పించారు. బుక్‌కీపర్లతో ఒత్తిడి చేయించి డ్వాక్రా మహిళలను తీసుకు వచ్చారు. మొత్తానికి టీడీపీ నేతలు పడరాని పాట్లు పడి పెద్ద ఎత్తున జనాలను పోగు చేశారు. అయితే అధికార పక్ష నేతల హడావుడిని నియంత్రించడంలో పోలీసులు వైఫల్యం చెందారు. ఫలితంగా ఆ మార్గంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


