లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి 84 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఎబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. వారి వినతుల్లోని సమస్యలు తెలుసుకుని, ఆయా స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలతో పాటు, సత్వరమే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా భూ, ఆస్తి తగాదాలకు సంబంధించి 39, భార్యభర్తలు, కుటుంబ కలహాలపై 5, వివిధ మోసాలపై 3, మహిళా సంబంధిత నేరాలపై 7, కొట్లాటలపై 2, దొంగతనాలపై 4, ఇతర వివిధ సమస్యలపై 24 ఫిర్యాదులు అందాయి.
చోరీకి వచ్చిప్రమాదవశాత్తు మృతి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ డివిజన్ కోచింగ్ డిపోలోని ఐఓహెచ్ షెడ్డులో రైల్వే సొత్తు చోరీ చేసేందుకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి షెడ్డుపై నుంచి జారిపడి మృతి చెందిన ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం విధులకు వచ్చిన సిబ్బంది షెడ్డులో గుర్తు తెలియని వ్యక్తి రక్తపు గాయాలతో బోర్లాపడి మృతిచెంది ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుని వయస్సు సుమారు 40–45 సంవత్సరాల మధ్య ఉంటుందని, వంటిపై నీలం, తెలుపు బనియన్, పచ్చరంగు షార్ట్ ధరించి ఉన్నాడని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. మృతుడు కోచింగ్ డిపోలో చోరీ చేసేందుకు వచ్చి ప్రమాదవశాత్తు షెడ్డు పైనుంచి జారిపడి మృతిచెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు ఒడిశాకు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా కోరారు.


