సాగునీరు రాదని ముందే చెప్పాలి కదా..! | - | Sakshi
Sakshi News home page

సాగునీరు రాదని ముందే చెప్పాలి కదా..!

Jul 28 2026 2:00 AM | Updated on Jul 28 2026 2:00 AM

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌

గన్నవరం రూరల్‌: సాగునీరు రాదంటే రైతులు ఎలా బతుకుతారని, ఖరీఫ్‌ సాగు చేపట్టిన తర్వాత నీరివ్వనంటే ఎలాగని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ప్రశ్నించారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని తెంపల్లె, వీరపనేనిగూడెం, కొత్తగూడెం గ్రామాల్లో ఆయన సోమవారం పోలవరం కెనాల్‌ సందర్శించి సాగు భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం కాలువ నీటిని నమ్ముకుని పదేళ్లుగా రైతులు వ్యవసాయం చేస్తున్నారని, ఈ సంవత్సరం మోటార్లు తొలగించటంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. కాలువ తవ్వకం సమయంలో కొందరు రైతులు కోర్టు కేసులు వేస్తే వారితో మాట్లాడి భూములు ఇప్పించామని గుర్తుచేశారు. రైతులు మొదట్లో ఒప్పుకోలేదని, ఒక ఎకరం పోయినా మిగిలినది బాగా పండుతుందని వారిని తాము ఒప్పించామని వివరించారు. ఈ ప్రాంతంలో డ్రాపులు పూర్తికాకపోవటంతో సాగునీటి కోసం రైతులు మోటార్లు ఏర్పాటు చేయగా అప్పట్లోనే ఇరిగేషన్‌, విద్యుత్‌ అధికారులు వ్యతిరేకించారన్నారు. అప్పటి సీఎం చంద్రబాబును కలసి సమస్య విన్నవించగా రైతులకు నీరు ఇచ్చారన్నారు. ఎవరైతే పోలవరం కాలువకు భూములిచ్చారో వారికి తప్పకుండా నీరు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. డెల్టా స్థిరీకరణ కోసం ఆలోచన చేసి పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని వంశీ చెప్పారు. ప్రస్తుతం సాగునీటి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ అడుగుతానన్నారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని, గతంలో మాదిరిగా రైతుల ప్రయోజనాల కోసం మోటార్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. వైఎస్సార్‌ సీపీ రైతు నాయకుడు కందిమళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ప్రాంత సాగు, తాగు అవసరాల కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీపీ అనగాని రవి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ సభ్యురాలు ఎలిజబెత్‌ రాణి, నాయకులు పడమట సురేష్‌, కొలుసు శిరీష, గిరీష్‌రాజ్‌, బండి నాగసాంబిరెడ్డి, తూంపాటి రాంబాబు, షేక్‌ సలాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement