డిగ్రీ.. డీగ్రేడ్‌! | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ.. డీగ్రేడ్‌!

Jun 3 2026 1:03 AM | Updated on Jun 3 2026 1:03 AM

డిగ్రీ.. డీగ్రేడ్‌! అస్తవ్యస్తంగా ఉన్నత విద్యా వ్యవస్థ

జూన్‌ వచ్చినా పూర్తికాని మొదటి ఏడాది పరీక్షలు సెకండ్‌ సెమిస్టర్‌ పూర్తి కావటానికి మరో నెల సమయం అటానమస్‌ కాలేజీల్లో మరింత గందరగోళం ఉన్నత విద్యాశాఖ విధానాలతో విద్యార్థుల్లో అయోమయం

అయ్యో.. అటానమస్‌..

అస్తవ్యస్తంగా ఉన్నత విద్యా వ్యవస్థ

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఉమ్మడి జిల్లాలో సాధారణ డిగ్రీ విద్యాసంవత్సరం అస్తవ్యస్తంగా మారింది. సాధారణంగా విద్యా సంవత్సరం అనగానే జూన్‌ మాసంలో ప్రారంభమై మార్చి లేదా ఏప్రిల్‌ మాసాంతానికి పూర్తి కావటం పరిపాటి. కానీ 2025–2026 డిగ్రీ కోర్సులో చేరిన మొదటి ఏడాది విద్యార్థుల విద్యా సంవత్సరం జూన్‌ వచ్చినా పూర్తి కాకపోవటంతో గందరగోళంగా మారింది. గడిచిన విద్యా సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ తదితర సాధారణ డిగ్రీ మొదటి సంవత్సరం చేరిన వారు సెమిస్టర్‌ విధానంలో ఇప్పటి వరకూ తమ కోర్సు తొలి ఏడాదిలో కావాల్సిన సెమిస్టర్‌లు పూర్తికాకపోవటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.

కృష్ణా వర్సిటీలో మరీ దారుణం..

ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఉన్న కళాశాలలు కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో కొనసాగుతుంటాయి. వర్సిటీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసి తదనుగుణంగా అందులో పరీక్ష ఫీజు చెల్లింపు, పరీక్ష జరిగే తేదీను ప్రకటిస్తుంది. ఈ క్రమంలో జూన్‌ 27 నుంచి సుమారుగా సెకండ్‌ సెమిస్టర్‌ థియరీ పరీక్షలు ఉండవచ్చని, ఏప్రిల్‌ 20వ తేదీ వరకూ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది. అలాగే థియరీ పరీక్షలు ముగిసిన తరువాత ప్రాక్టికల్స్‌ సైతం ఉంటాయని ఆ షెడ్యూల్‌లో ప్రకటించింది. అయితే పరీక్షల తేదీలను మాత్రం నిర్ధిష్టంగా ప్రకటించకపోవడం గమనార్హం. అంటే జూన్‌, జూలై మాసాంతం వరకూ ఈ పరీక్షలు జరిగినా, ద్వితీయ ఏడాది విద్యాసంవత్సరం ఆగస్టు చివర లేదా సెప్టెంబర్‌ మాసాల్లో ప్రారంభమయ్యే అవకాశముంది.

డిసెంబర్‌ వరకూ అడ్మిషన్లు..

గడిచిన రెండు మూడేళ్లుగా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను డిసెంబర్‌ వరకూ కొనసాగించటంతో ఈ అస్తవ్యస్తమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఏప్రిల్‌ లేదా మే మాసంలో ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాలు వెలువడుతున్నాయి. ఆ ఫలితాలు వచ్చిన వెంటనే డిగ్రీ కోర్సులకు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాల్సిన ఉన్నత విద్యాశాఖ ఆ దిశగా సకాలంలో చర్యలు చేపట్టకపోవటంతో ఈ విధమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇంజినీరింగ్‌ తదితర ఇతర కోర్సుల అడ్మిషన్లు ప్రక్రియ పూర్తయిన తరువాత సాధారణ డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్‌ ప్రకటించటం, డిసెంబర్‌ వరకూ అడ్మిషన్లను నిర్వహించటంతో ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు.

దయనీయంగా అధ్యాపకుల పరిస్థితి

విద్యా సంవత్సరం ఏటా సకాలంలో పూర్తికాకపోవటంతో అధ్యాపకుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు మార్చి లేదా ఏప్రిల్‌లో జరగకపోవటంతో ఆయా కళాశాలల యాజమాన్యాలు మేలోనూ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. విశ్వవిద్యాలయం సెలవులు ప్రకటించినా అటానమస్‌ కళాశాలలు మాత్రం పని చేస్తుండటంతో అధ్యాపకులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ప్రధానంగా ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయం ప్రకటించిన షెడ్యూల్‌ అనుసరించాల్సిన అటానమస్‌ కళాశాలలు తమకు వాటితో సంబంధం లేదంటూ ఇష్టారాజ్యంగా తరగతుల నిర్వహణ చేస్తుండటంతో మంచి వేసవిలోనూ విద్యార్థులు, అధ్యాపకులు తరగతులకు హాజరుకావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికై నా సరిదిద్దాలి..

కరోనా సమయంలో తలెత్తిన పరిస్థితులతో విద్యా సంవత్సరంలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ రెండుమూడేళ్లు మాత్రం ఇబ్బందులు తతెత్తి విద్యాసంవత్సరం ఆలస్యమైంది. అయితే ఆ పరిస్థితుల నుంచి బయట పడినప్పటికీ ఇతర కోర్సుల సీట్లు నిండిన తరువాత సాధారణ డిగ్రీ కోర్సుల అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ప్రకటిస్తుంది. దాంతో పరిస్థితులు తారుమారవుతున్నాయి. ఇప్పటికైనా దిగజారు తున్న పరిస్థితుల దృష్ట్యా షెడ్యూల్‌ సరిదిద్దాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

ఉమ్మడి కృష్ణాజిల్లాలో అనేక అటానమస్‌ డిగ్రీ కళాశాలలు కొనసాగుతున్నాయి. ఆయా కళాశాలలన్నీ ఉన్నత విద్యామండలి ఆదేశాలకు అనుగుణంగా సొంతంగా సెమిస్టర్‌ పరీక్షలను నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తుంటాయి. అయితే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అన్ని అటానమస్‌ కళాశాల్లోనూ దాదాపుగా సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కాలేదు. ఆ కళాశాలలన్నీ జూన్‌ లేదా జూలై మాసాల్లో 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించనున్నాయి. దాంతో ఏ విద్యాసంవత్సరంలో తాము ఉన్నామో అర్థం కాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement