వైద్య విద్యార్థుల్లో స్నాతకోత్సాహం
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం 29, 30వ వార్షిక స్నాతకోత్సవాన్ని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో యూనివర్సిటీ చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, వీసీ డాక్టర్ పి. చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయిసుధీర్ పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. తొలుత రాష్ట్ర గవర్నర్ చేతుల మీదగా 29వ స్నాతకోత్సవంలో ఐదుగురికి, 30వ స్నాతకోత్సవంలో నలుగురికి డాక్టరేట్స్ ప్రదానం చేశారు. అలాగే సూపర్‌స్పెషాలిటీ కోర్సులు చేసిన వారికి 29వ స్నాతకోత్సవంలో ఆరుగురికి, 30వ స్నాతకోత్సవంలో ఐదుగురికి గవర్నర్ చేతుల మీదగా గోల్డ్‌మెడల్స్ అందజేశారు.
ఒక్కడికే ఎనిమిది గోల్డ్ మెడల్స్..
అతిథులు, వీసీ డాక్టర్ పి. చంధ్రశేఖర్‌లు 29వ స్నాతకోత్సవంలో 62, 30వ స్నాతకోత్సవంలో 61 గోల్డ్‌మెడల్స్ ప్రదానం చేశారు. కాకినాడకు చెందిన సాయి అనిరుథ్ అత్యధికంగా 8 గోల్డ్‌మెడల్స్ అందుకోగా, కర్నూలుకు చెందిన పెరిగెల నమ్రత 6 బంగారు పతకాలు అందుకున్నారు. తిరుపతికి చెందిన ఆయుర్వేద విద్యార్థిని ఆర్‌ఎస్‌వీ సరిత రెండు గోల్డ్, రెండు సిల్వర్ మెడల్స్ అందుకోగా, విజయవాడకు చెందిన ఆయుర్వేద విద్యార్థిని సీహెచ్ తులసీ అర్చన లక్ష్మి రెండు గోల్డ్, మూడు సిల్వర్ మెడల్స్ అందుకున్నారు.
గుంటూరుకు చెందిన కవలలు ఐ.సుమన, ఐ.సంజన స్నాతకోత్సవాలలో ఒక్కొక్కరు రెండు బంగారు పతకాలు సాధిండం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బీడీఎస్ చదువుతున్న ఈ ఇద్దరు ప్రతిష్టాత్మకమైన పీఎఫ్‌ఏ ఇంటర్నేషనల్ అవార్డు, డాక్టర్ ఆర్ అహ్మద్ నేషనల్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ప్రసుతం ఎండీఎస్ చదువుతున్న వీరు పేదలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు.
హెల్త్ యూనివర్సిటీ
29, 30వ స్నాతకోత్సవాల్లో
123 మందికి మెడల్స్
సాయి అనిరుథ్‌కు 8, నమ్రతకు 6 గోల్డ్ మెడల్స్
పలువురికి డాక్టరేట్ల ప్రదానం


