ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పెనమలూరుకు చెందిన కిలారు రామ్మోహనరావు కుటుంబం మంగళవారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసిన రామ్మోహనరావు తన భార్య విశాలక్ష్మి పేరిట ఉచిత ప్రసాద వితరణకు రూ.1.25లక్షలు, మల్లేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి రూ. 50వేలు, గోసంరక్షణ పథకానికి రూ. 50వేలను అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
పామర్రు: కృష్ణాజిల్లా పామర్రు మండలం ఉండ్రపూడి–పోలవరం అడ్డరోడ్డు వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి ఆలయానికి దాతలు వెండి కిరీటాన్ని మంగళవారం సమర్పించారు. ఉండ్రపూడికి చెందిన మేకా శ్రీహరి రావు, నున్న రాంబాబు మనవడు మేకా అర్జున్ సాన్విక్ స్వామివారికి 975 గ్రాముల బరువుగల వెండి కిరీటం సమర్పించారు. కిరీటం విలువ సుమారు రూ.3లక్షలు ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ తాడిశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు. దాతలకు శేష వస్త్రాలను అందించి సత్కరించారు. అలాగే దేవిరెడ్డి సుదర్శన్‌రెడ్డి హైమావతి దంపతులు, తోట సుధారాణి, జువ్వనపూడి శోభన్‌రాజు, కోటేశ్వరమ్మ దంపతులు కలిసి స్వామివారికి 25 కేజీల పులిహోరను ప్రసాదంగా అందజేశారని ఈవో పీవీఎన్‌వీ ప్రసాదరావు తెలిపారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజ సేవలో యువత భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో యూత్ టైమ్ బ్యాంక్ పేరుతో రోగులకు విద్యార్థులు అందిస్తున్న సేవలను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ యూత్ టైం బ్యాంక్ ద్వారా యువత తమ సమయాన్ని సమాజానికి అంకితం చేస్తూ సేవా దృక్పథాన్ని చాటుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇంద్రకీలాద్రిపై కూడా సేవలు విస్తరించాలంటూ యువజన సంక్షేమ శాఖ జిల్లా ముఖ్య కార్యనిర్వాహణాధికారి కొల్లేటి రమేష్‌ను ఆదేశించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్, ఆర్‌ఎంవో తదితరులు పాల్గొన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రకృతి వ్యవసాయ కార్యాచరణకు సంబంధించిన పుస్తకాన్ని కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం ఆయన చాంబర్‌లో ఆవిష్కరించారు. 2026– 27 సంవత్సరంలో వాతావరణ పరిస్థితులను బట్టి వివిధ పంటలను ప్రకృతి వ్యవసాయం సాగు పద్ధతులు, పరిష్కార మార్గాలను పుస్తకంలో ప్రచురించినట్లు కలెక్టర్ తెలిపారు. దీనిని వ్యవసాయశాఖ సిబ్బంది, రైతు సాధికార సంస్థ సిబ్బంది, రైతులకు పూర్తిగా అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లా వ్యవసాయాధికారి జ్యోతి రమణి, ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పార్థసారథి, వ్యవసాయ సహాయ సంచాలకులు ఎన్.మణిధర్ ఉన్నారు.


