చంద్రబాబు రెండేళ్లలో చేసిందేమీ లేదు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ ఆవిష్కరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. తన 40 ఏళ్ల అనుభవంతో వైఎస్ జగన్ కంటే మంచి పాలన అందిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఈ నెల 4 నుంచి 12 వరకూ చేపట్టనున్న ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాల పోస్టర్‌లను మంగళవారం గుణదలలోని కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా మేనిఫెస్టో దహన కార్యక్రమాలు మండల, పట్టణ, జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. కూటమి హయాంలో ఏ నష్టాలు జరిగాయో ప్రజలకు వివరిస్తామని, టీడీపీ, జనసేన, బీజేపీలకు బుద్ధి వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తామన్నామన్నారు.
మోసాల చంద్రబాబు..
ప్రజలను ఇప్పటికీ ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు అన్నారు. నిరుద్యోగ భృతి ఒక్కరికీ ఇవ్వడం లేదని, మెగా డీఎస్సీతో దగా చేశారన్నారు. వృద్ధులకు 50 ఏళ్లకే పింఛన్ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని, తల్లికి వందనం పేరుతో వేల మందికి ఎగనామం పెట్టారన్నారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కూటమి రెండేళ్ల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. మహిళలకు 18 ఏళ్లు నిండితే నెలకు రూ.1500 అన్నారని, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. చేతకాని మాటలు చెబుతూ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని మండిపడ్డారు. మాజీ జెడ్పీ చైర్ పర్సన్ నల్లగట్ల సుధారాణి, రాష్ట్ర సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు, బండి పుణ్యశీల, సర్నాల తిరుపతిరావు, రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


