‘దేవుడే దిగిరావాలేమో’ కథనంపై అధికారుల స్పందన హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన దేవదాయ శాఖ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎట్టకేలకు మచిలీపట్నంలోని గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూమిని దేవదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు కూత వేటు దూరంలో గొల్లపూడిలో ఎకరం రూ.10కోట్ల విలువ చేసే39.99 ఎకరాలు, అంటే రూ.400కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నామని ఆలయ ఈవో గోపాలరావు ధ్రువీకరించారు. మే నెల 22వ తేదీన సాక్షి దినపత్రికలో ‘ఇక దేవుడే దిగిరావాలేమో’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో దేవదాయశాఖ అధికారులు స్పందించారు. భూమికి నలువైపులా ‘బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ స్థలం గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూమిగా సర్వే నంబర్ల సహా పేర్కొన్నారు. ఈ భూమి పరిరక్షణ కోసం చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు మే నెల 26నే షార్ట్ టెండర్‌లు పిలిచామని ఈవో తెలిపారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందన్నారు. తక్కువ ధర రూ.10లక్షలకు కోట్ చేసిన కాంట్రాక్టర్ పని అప్పజెప్పామని, రెండు, మూడు రోజుల్లో ఫెన్సింగ్ ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయన్నారు. దీంతో ధార్మిక సంస్థల పేరుతో పార్లమెంటు ప్రజా ప్రతినిధి భూమి స్వాధీనం చేసుకొనే కుట్రలకు కూడా తెరపడినట్లు అయ్యింది. కాగా కోర్టు ఉత్తర్వుల ప్రకారం భూమిలో 4నుంచి 6 అడుగుల మేర వేసిన మట్టిని త్వరిత గతిన తొలగించాలని పలు సంఘాలవారు దేవదాయశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.


