దగా డీఎస్సీపై దద్దరిల్లిన కలెక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

దగా డీఎస్సీపై దద్దరిల్లిన కలెక్టరేట్‌

Jun 2 2026 5:59 AM | Updated on Jun 2 2026 5:59 AM

దగా డీఎస్సీపై దద్దరిల్లిన కలెక్టరేట్‌

పెద్ద ఎత్తున తరలివచ్చి నినదించిన యువత డీఎస్సీ అవకతవకలపై విచారణ జరపాలని డిమాండ్‌ అసమర్థ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని నినాదాలు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన వైఎస్సార్‌ సీపీ నేతలు

నమ్మకద్రోహం చేసింది..

మెగా కాదు దగా డీఎస్సీ..

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక నిరసన కార్యక్రమం సోమవారం జరిగింది. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య ఆధ్వర్యంలో యువత భారీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. తొలుత కోర్టు సముదాయం సమీపంలోని రమాక్లాత్‌ సెంటర్‌ వద్ద నుంచి కలెక్టరేట్‌కు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. మెగా లీక్‌.. దగా డీఎస్సీ, మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలి, డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలి.. అంటూ ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు.

ఆంక్షలు..

అడ్డంకులు..

శాంతియుతంగా ర్యాలీ చేస్తూ కలెక్టరేట్‌కు చేరుకున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, యువతను పోలీసులు గేటు వద్దనే అడ్డుకున్నారు. కలెక్టరేట్‌ లోపలికి వెళ్లనీకుండా గేట్లు మూసివేశారు. ఆ సమయంలో పోలీసులు, వైఎస్సార్‌ సీపీ నాయకులకు మధ్య స్వల్పంగా వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు యువతను తోసివేశారు. తోపులాటలో యువత చొక్కాలు చిరిగిపోయాయి. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసేందుకు కొద్దిమందిని అనుమతించారు. పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్‌మోహన్‌రావు, తిరువూరు ఇన్‌చార్జ్‌ నల్లగట్ల స్వామిదాసు, జగ్గయ్యపేట ఇన్‌చార్జ్‌ తన్నీరు నాగేశ్వరరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్యతో పాటు మరికొందరు నాయకులు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్‌లో వైఎస్సార్‌ సీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కార్యక్రమంలో నగర మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డెప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ, అవుతు శ్రీనివాసరెడ్డి, పోతిన మహేష్‌, ఏ రవిచంద్ర, విద్యార్థి, యువజన, అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఎంపికై న, ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులు చెబుతున్నారు. వారిలో చాలా మందికి ఒక్కరికీ ఉద్యోగాలు రాలేదు. పరీక్ష నిర్వహణలో పారదర్శకత లోపించింది. లక్షలాది రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరవాలి. నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి.

– నలగట్ల స్వామిదాసు,

వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి, తిరువూరు

రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ నిర్వహించింది. నిరుద్యోగులను నిండా ముంచింది. ఈ అక్రమాలపై ప్రశ్నిస్తే నిర్బంధించింది. కలెక్టరేట్‌లోకి ప్రవేశం లేకుండా చేసింది. యువతను అడ్డుకుని చొక్కాలు చించివేశారు. పోలీసులు దౌర్జన్యం చేశారు. డీఎస్సీలో అన్ని దశల్లో అక్రమాలు జరిగాయి. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి.

– తన్నీరు నాగేశ్వరరావు,

ఇన్‌చార్జి, జగ్గయ్యపేట

Advertisement
 
Advertisement
Advertisement