జీజీహెచ్‌లో ఈ ఏడాది మరణాలు ఇలా..
వైద్య రంగంపై నిర్లక్ష్యం తగదు..
పేదలకు పెద్దన్నలా సేవలందించాల్సిన ప్రభుత్వాస్పత్రికి పెద్ద రోగం వచ్చిందా అనే అనుమానం కలుగుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వస్తే బాగుపడతాం అనే నమ్మకం ప్రజల్లో క్రమంగా సన్నగిల్లుతోంది. ఇటీవల కాలంలో ఆస్పత్రిలో సేవలు సక్రమంగా అందడం లేదన్న భావన వ్యక్తమవుతోంది. అందుకు ఆస్పత్రిలో ఇటీవల చోటుచేసుకుంటున్న మరణాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒక్క మే నెలలోనే ఏకంగా 570 మరణాలు సంభవించడం భయాందోళనలు రేకెత్తిస్తోంది.
అమ్మో.. పెద్దాస్పత్రి అంటున్న రోగులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ సర్వజన ఆస్పత్రిలో డెత్‌రేట్ పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు రోజుకు 12 నుంచి 15 వరకూ మరణాలు నమోదయ్యాయి. ఇప్పుడు అవి 20కి పెరిగాయి. అంతేకాదు ఒక్క మే నెలలోనే ఏకంగా 570 మరణాలు నమోదు కాగా, ఎండలు అధికంగా ఉన్న ఒక్కరోజే 42 మరణాలు సంభవించాయి. ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలు దిగజారుతున్నాయనేందుకు ఇవే నిదర్శనంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నిపుణులైన వైద్యులు ఉన్నా, మెరుగైన వైద్యం అందించేందుకు కనీస సౌకర్యాలు కొరవడినట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రాణాపాయ స్థితిలో వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందించలేక పోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సౌకర్యాల లేమితోనేనా?
ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర సమయంలో ప్రాణ వాయువు అందించే వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. ఒకప్పుడు వెంటిలేటర్లు 80 వరకూ ఉండేవి, వాటిలో చాలా వరకూ పాడైపోవడంతో వాటిని పక్కన పెట్టేశారు. ప్రస్తుతం 35 వరకూ ఉన్నాయి. వాటిలో ఎన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఎంపీ నిధుల నుంచి నాలుగు వెంటిలేటర్లు అందజేశారు. వాటిని ట్రామాకేర్ వార్డులో ఏర్పాటు చేశారు. ఇంకా ఐసీయూల్లో తీవ్ర మైన కొరత ఉంది. ప్రాణాపాయంతో వచ్చిన వారిని ఉంచేందుకు వెంటిలేటర్లు అందుబాటులో ఉండని పరిస్థితి తలెత్తుతోంది. ఎక్కువ మరణాలు సంభవించడానికి అది కూడా ఒక కారణమనే అనుమానాలు ఉన్నాయి. గతంలో ఖరీదైన అత్యవసర ఇంజెక్షన్స్‌ను ముందుగానే కొనుగోలు చేసి ఉంచేవారు. ఇప్పుడు అవి అవసరమైనప్పుడు అత్యవసరంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో కొంత జాప్యం జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా డెత్‌రేట్ పెరగడానికి అనేక కారణాలున్నట్లు అంచనా వేస్తున్నారు.
పర్యవేక్షణాలేమి కూడా..
ఆస్పత్రిలో వైద్య సిబ్బందిలో జవాబుదారీతనం కొరవడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రోగి ప్రాణాలు పోతున్నాయని చెప్పినా, వార్డుల్లో ఉండే సిబ్బంది పట్టించుకోని పరిస్థితి నెలకొంది. కనీసం కుర్చీలో నుంచి రోగి వద్దకు వచ్చే పరిస్థితి కూడా సిబ్బందిలో కనిపించడం లేదు. మరోవైపు కొందరు వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసుపైనే మక్కువ చూపుతున్నారు. మొక్కుబడిగా రావడం. ఎఫ్‌ఆర్‌ఎస్ వేయడం, వెళ్లిపోవడం జరుగుతోంది. ఇలా వైద్యం అందించడంలో నిర్లక్ష్యం కూడా రోగుల ప్రాణాల మీదకు వస్తోంది. ఇప్పటికై నా అధికారులు, వైద్యులు, సిబ్బందిలో జవాబుదారీతనం వచ్చేలా చూడాలనే డిమాండ్ పెరుగుతోంది.
జనాలు పిట్టల్లా రాలిపోతున్నా పట్టని సర్కారు
ఒక్క రోజే 42మంది మృతి
ప్రభుత్వాస్పత్రిలో రోగులు పిట్టల్లా రాలుతున్నారు. 2026లో జనవరిలో 523, ఫిబ్రవరిలో 524, మార్చిలో 417, ఏప్రిల్‌లో 484, మేలో 570 మరణాలు అధికారికంగా నమోదయ్యాయి. అంతేకాదు మే నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న మూడు రోజుల్లో ఒకరోజు 42 మరణాలు నమోదు కాగా, మరోరోజు 39 మరణాలు, ఇంకోరోజు 36 మరణాలు నమోదయ్యాయి. మొత్తంగా ఏప్రిల్ 25 నుంచి మే 25 వరకూ 570 మరణాలు సంభవించాయి. అందుకు ప్రధాన కారణం అధిక ఉష్ణోగ్రతలుగా చెబుతున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. అంతేకాదు ఆస్పత్రికి వచ్చేసరికే మరణించిన వారు మరో 15 నుంచి 20 మంది ఉంటారని అంచనా. ఈ బ్రాట్ డెత్‌లు ఆస్పత్రి రికార్డుల్లో నమోదు కావు.
విజయవాడ జీజీహెచ్‌లో
ఒక్క నెలలోనే 570 మరణాలు
వైద్య రంగం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం తగదు. ప్రభుత్వాస్పత్రులకు వచ్చేది ఎక్కువగా పేద ప్రజలే. వారికి నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆస్పత్రిలో వెంటిలేటర్ల కొరత ఉందని రెండేళ్లుగా చెబుతున్నా ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించి, నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేయాలి.
– దేవినేని అవినాష్,
జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ


